“జయప్రద”కు ఈఎస్ఐ కేసులో ఊరట

జైలు శిక్షను రద్దు చేసిన సుప్రీంకోర్టు

“నేటిధాత్రి” హైదరాబాద్: తన సినిమా థియేటర్‌లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్‌ చెల్లించని కేసులో సీనియర్‌ నటి జయప్రదకు పడిన ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్‌ అభయ్‌ ఓకా, ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. థియేటర్‌ యాజమాన్యం రూ. 9లక్షల80వేలను ఈఎస్‌ఐ కంట్రిబ్యూషన్‌ కింద జమ చేసినందున కోర్టు శిక్షను రద్దు చేసింది. చెన్నైలోని జయప్రదకు చెందిన సినీ థియేటర్‌లో జయప్రద, ఆమె ఇద్దరు సోదరులు వాటాదారులుగా ఉన్నారు. ఈ థియేటర్‌ 10 ఏళ్ల క్రితమే మూతపడింది. అయితే ఈ థియేటర్‌లో పనిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ఈఎస్‌ఐ పేరుతో కోతలు విధించి తమ వద్ద జమ చేయలేదని ఈఎస్‌ఐకార్పొరేషన్‌(ఈఎస్‌ఐసీ) కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన చెన్నైలోని మెట్రోపాలిటన్‌ కోర్టు గత ఏడాది ఆగస్టులో జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అనంతరం ఈ కేసులో ఆమె అప్పీల్‌కు వెళ్లగా సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!