పోలింగ్ కేంద్రంలో ఓటర్ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి

భూపాలపల్లి నేటిధాత్రి

పోలింగ్ కేంద్రంలో ఓటరు
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకునేట్లు చూడాల్సిన బాధ్యత
ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాంటిసోరి ఉన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పార్లమెంటు ఎన్నికలు నిర్వహణలో పిఓ, ఎపిఓ విధులు నిర్వహించు సిబ్బందికి నిర్వహిస్తున్న ఒకరోజు శిక్షణ తరగతులను పరిశీలించి ఎన్నికలు నిర్వహణలో అవలంబించాల్సిన విధివిధానాలు, పోస్టల్ బ్యాలెట్ వినియోగం తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై పిఓ, ఏపీవోలు పూర్తిస్థాయిలో అవగాహన కలగి ఉండాలని అన్నారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో భారత ఎన్నికల సంగ నిబంధనలు ప్రకారం ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా ఖచ్చితంగా మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఈవిఎం, వివిపాట్ వినియోగంపై పిఓలు, ఎపివోలు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని, నిర్లక్ష్యం వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా ఎన్నికల సంగం నిబంధనలు మేరకు తీవ్రమైన చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. శిక్షణ తరగతులను తేలికగా తీసుకోవద్దని ఒకవేళ ఇంతకుముందు ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ నుండి ఎప్పటి కపుడు వస్తున్న నూతన నియమాలను తెలుసుకోవడానికి ఈ శిక్షణా కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఎన్నికల నిబంధనలు విధి, విధానాలు సమయానుగుణంగా మారుతుంటాయని, కాబట్టి తాజాగా చట్టానికి సంబంధించిన నియమాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పోలింగ్ ప్రక్రియలో ఈవిఎం, వివిపాట్ వినియోగం, సీల్ వేయటం, ప్రత్యేక ట్యాగ్, పోలింగ్ కేంద్రంలో ఉపయోగించే అన్ని రకాల స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ ఫారాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
పోలింగ్ ప్రారంభానికి ముందు ఏజెంట్లకు పోలింగ్ నియమాలపై వివరించాలని, పోలింగ్ ప్రారంభించడానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించు విధానంపై వివరించాలన్నారు. మాక్ పోలింగ్ లో 50 కి తక్కువ కాకుండా ఓట్లు వేయాలని, వేసిన ఓట్లు వివిపాట్ లోని స్లిప్పులతో సరిచూసిన తదుపరి ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేసి అనంతరం నిర్దేశిత సమయంలోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడంపై అవగాహన ఉండాలన్నారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై పిఓలు, ఎపిఓలు అవగాహన కొరకు హ్యాండ్ బుక్ (కరదీపిక) అందచేస్తున్నామని క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని చదవాలని పేర్కొన్నారు. బ్యాలెట్ గోప్యతను కాపాడే విధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ ప్రాంతం, ఓటర్ల వివరాలు తెలిపే నోటీసు బోర్డులు, ఫారం -7 లో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాని పోలింగ్ స్టేషన్ బయట ఏర్పాటు చేయాలన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ లోని సూచనల ప్రకారం అన్ని పత్రాలను సీల్ చేయాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పిఓ, ఓపిఓలకు ఓటు హక్కు వినియోగానికి ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ జారీ చేస్తున్నామని, ఫారం 12 తో పాటు సిబ్బంది ఓటు హక్కు కలిగివున్న పార్లమెంట్ శాసనసభ నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం, ఓటరు జాబితాలోని క్రమసంఖ్యను ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఉన్న ప్రాతంలో ఓటు హక్కు న వినియోగించడానికి ప్రత్యేక సెలవు మంజూరు చేస్తామని, అలాకాకుండా పనిచేస్తున్న ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించు కోవడానికి మరొక అవకాశం ఉందని, ఫారం 12 లో పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం ఓటు హక్కు వినియోగానికి అవకాశం కల్పిస్తామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంగం, జిల్లా ఎన్నికల అధికారి పర్యవేక్షణ చేస్తారని ఆయన తెలిపారు.
గత ఎన్నికల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి పొరపాట్లు రాకుండా ఎన్నికల నిర్వహణ నూరు శాతం విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ రోజు 560 మంది శిక్షణా కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా 22 మంది గైర్హాజరయ్యారని వారందరికి షో కాజ్ నోటీస్ జారీ చేయాలని తెలిపారు. నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన సిబ్బంది 6వ తేదీన నిర్వహించే శిక్షణకు తప్పక హాజరు కావాలని, 6వ తేదీన నిర్వహించు శిక్షణకు గైర్హాజరైన సిబ్బందిపై ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో సిబ్బంది మేనేజ్మెంట్ నోడల్ అధికారులు శామ్యూల్, అవినాష్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి నారాయణరావు, బిసి సంక్షేమ అధికారి శైలజ,
ఆర్డిఓ మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!