
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
ప్రపంచంలోని ఇన్సూరెన్స్ కార్పొరేషన్లలో అత్యంత అగ్రగామిగా నిలిచిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను సురక్షితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి అన్నారు. శనివారం రోజు జడ్చర్ల కేంద్రం లోని ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో నిర్వహించిన యూనియన్ బ్రాంచ్ సర్వసభ్య సమావేశానికి
మద్దిలేటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న క్లిష్ట పరిస్థితులు ఇన్సూరెన్స్ రంగానికి గొడ్డలి పెట్టులా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో ఎల్ఐసి
ఆఫ్ ఇండియాను సంరక్షించుకోవడం తప్పనిసరి అని ఆయన అన్నారు. దేశ ఆర్థిక రంగానికి ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఆయువు పట్టు లాంటిదని, ఇలాంటి సంస్థను ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న ప్రజా వ్యతిరేక,ఉద్యోగ వ్యతిరేక ఎన్డీఏ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక చర్యలను అడ్డుకోవాలని, అప్పుడే ఎల్ఐసికి మనుగడ ఉంటుందని అందుకోసం అందరూ ఏకమై ఐకమత్యంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యాలయానికి వచ్చే పాలసీదారులు, ఏజెంట్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు అందరూ కూడా ఉద్యోగులకు కస్టమర్ల లాంటి వారేనని అందరికీ మంచి సేవలు అందించి ఆదర్శవంతమైన ఉద్యోగులుగా నిలవాలని మద్దిలేటి కోరారు. ఈ సందర్భంగా యూనియన్ జడ్చర్ల బ్రాంచ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
బ్రాంచ్ అధ్యక్షుడిగా డి.వేణుగోపాల్,
ప్రధాన కార్యదర్శిగా బి.శ్రీనివాసులు, కోశాధికారిగా సాబేర్, సంయుక్త కార్యదర్శిగా
వి. ప్రశాంత్, శ్రీకాంత్, ఉమెన్ సబ్ కమిటీ మెంబర్ గా బి.ఝాన్సీలు
ఎంపికయ్యారు.
ఈ సంవత్సరం పదవీ విరమణ చేయబోయే ఎల్ఐసి సీనియర్ ఉద్యోగి కె.నర్సింలుకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డివిజన్ నాయకులు యాదగిరి రావు, రాజేశ్వర్, రామ్మోహన్, లియాపీ నాయకులు రంగ రాములు,శోభన్ బాబు, బ్రాంచ్ నాయకులు యాదిరెడ్డి,నిర్మల,పావని తదితరులు పాల్గొన్నారు.