-డాక్టర్ నవత
-తల్లిదండ్రుల ఆశయం మేరకే వైద్య వృత్తి
-మొగుళ్లపల్లి మండలంలో ఆదర్శ వైద్యాధికారిణిగా మంచి గుర్తింపు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
కాసుల వర్షం కురిపించే కార్పొరేట్ వైద్యాన్ని కాదని..పల్లెల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించి..వారి ఆరోగ్యాన్ని కాపాడడమే మహాభాగ్యంగా భావించి..తల్లిదండ్రుల ఆశయం మేరకు వైద్య వృత్తిని ఎంచుకుని.. దృఢమైన సంకల్పంతో..తన కలలను సాకారం చేసుకుంటున్న మొగుళ్లపల్లి సీనియర్ వైద్యాధికారిణి డాక్టర్ గొడిశాల నవత-శ్రీనివాస్ గౌడ్ ల సేవలు అభినందనీయమంటున్నారు మొగుళ్ళపల్లి మండల ప్రజలు.. డాక్టర్ గొడిశాల నవత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల ప్రాంతంలో గల నడికుడలో గొడిశాల నీలావతి-పరమేశ్వర్ దంపతులకు మూడవ సంతానంగా జన్మించింది. చిన్నప్పటినుండే చదువులో ముందంజలో ఉండేది. నవత తండ్రి పరమేశ్వర్ నడి కూడా గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రజలకు వైద్య సేవలను అందించేవారు. ఈ క్రమంలో అతి సామాన్య గౌడ సామాజిక కుటుంబ నేపథ్యం కలిగిన పరమేశ్వర్ చదువులో ముందంజలో ఉన్న చిన్న కూతురు నవతను ఎలాగైనా ఉన్నత చదువులు చదివించి..డాక్టర్ ను చేయాలనే ఉద్దేశంతో కష్టపడి చదివించారు. తల్లి ఆశయాలను నెరవేర్చేందుకు నవత అంకుటిత దీక్షతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించింది. గొడిశాల నవత 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు నడికూడలోని ప్రైమరీ స్కూల్లో, 4 నుండి 10 వరకు ఆదర్శ హైస్కూల్ హన్మకొండలో, ఎస్వీఎస్ హన్మ కొండలో ఇంటర్ విద్యనభ్యసించిన ఆమె 2010లో ఎంబిబిఎస్లో చేరి 2016లో మెడికల్ విద్యను పూర్తి చేశారు. అనంతరం సిద్దిపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 4 సంవత్సరాలు పీడీ యార్టికల్ పిల్లల సంరక్షణ విభాగంలో పనిచేశారు. అనంతరం 2023 జనవరిలో మొగుళ్లపల్లి ప్రాథమిక వైద్యశాలలో రెండవ వైద్యాధికారిణిగా విధుల్లో చేరారు. అప్పటినుండి మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో గల ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలను నిర్వహిస్తూ..ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే తన సంకల్పాన్ని కార్యరూపంలో అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు గా కొనసాగుతున్న కొందరు..సంపాదనే లక్ష్యంగా ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుంటున్న తరుణంలో..ఆమెను కూడా ప్రైవేట్ క్లినిక్ ఏర్పాటు చేసుకోవాలని సన్నిహితులు సలహాలు ఇస్తున్నప్పటికీ, తనకు అలాంటి ఉద్దేశం లేదని..పల్లె ప్రజలకు సేవ చేయడమే తనకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నానని డాక్టర్ నవత సన్నిహితుల సలహాలను తిరస్కరించడం గమనార్హం. అదేవిధంగా డాక్టర్ నవత భర్త శ్రీనివాస్ గౌడ్ కూడా ఆర్థోపెటిక్ లో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ..పలువురు ప్రముఖుల ప్రశంసలను పొందుతున్నారు. ఈ దంపతుల జంట పలువురికి ఆదర్శనీయమని, పుట్టిన ఊరికి..కన్న తల్లిదండ్రులకు..విద్య నేర్పిన గురువులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం గర్వకారణమని మండలంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, తోటి ఉద్యోగులు ప్రశంసలు కురిపిస్తున్నారు.