ఇండస్ట్రియల్ హబ్ లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకురావాలి
– మైలారం గుట్టల్లో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి పనులను రెవెన్యూ, పరిశ్రమల శాఖ, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే జీఎస్సార్
– వ్యాపారవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే
– 187 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు
గణపురం నేటి ధాత్రి
భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం మైలారం గ్రామ శివారులోని గుట్టల్లో 187 ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ హబ్ లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. ఈరోజు సోమవారం రెవెన్యూ, ఇండస్ట్రీయల్, పోలీస్ ఇతర శాఖల అధికారులతో కలిసి మైలారం గుట్టపై జరుగుతున్న ఇండస్ట్రియల్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జీఎస్సార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ. మైలారం రెవెన్యూ శివారులోని 204/1 ,205/1 సర్వే నెంబర్ లలో మొత్తం 187 ఎకరాలు భూమి ఉందన్నారు. ప్రభుత్వ భూమి దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు స్థలం కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మంత్రులు, ఎంపీల సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాంతాన్ని టూరిజం, ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చి దిద్దుతున్నామన్నారు. ఇండస్ట్రీస్ పార్క్ కొరకు 60 ఎకరాల్లో 197 ఫ్లాట్లు కేటాంచడం జరిగిందన్నారు. స్క్వేర్ ఫీట్ రూ.1600 లకు టెండర్ కూడా త్వరలోనే ఓపెన్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ కు 40 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయంకు 10 ఎకరాలు, సైనిక్ స్కూల్ కు 20 ఎకరాలు, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కు 15 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. ఇప్పటికే రోడ్డు పనులకు రూ.4 కోట్లు ఖర్చు చేశారని మరో రూ.15 కోట్ల నిధులు సమకూర్చుతున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నేతలు, అధికారులు, కార్యకర్తలు ఉన్నారు.