గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనపై విచారణ…
విచారణ పారదర్శకంగా చేపట్టాం….
గురుకుల పాఠశాలల జోనల్ ఇంచార్జ్ గిరిజ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో రెండు రోజుల క్రితం గోల్డ్ చైన్ పోయిందని భావించి ఇద్దరు విద్యార్థినిలను పాఠశాల పి.ఈ.టి చితకబాదడం తో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు సోమవారం విచారణ చేపట్టారు. ఈ విచారణలో గురుకుల పాఠశాలల జోనల్ ఇన్చార్జ్ గిరిజ, జిల్లా ఇంచార్జ్ అధికారి కే. మహేశ్వరరావు, జిల్లా కోఆర్డినేటర్ రమా కల్యాణి, పట్టణ ఇంచార్జ్ ఎస్ఐ నూనె శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు పాల్గొన్నారు. బాధిత విద్యార్థినులు, వారి తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయురాళ్ళను, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రేమా రాణి నీ కూడా అధికారులు విచారించారు. ఈ సందర్భంగా జోనల్ ఇంచార్జ్ గిరిజ మాట్లాడారు. పాఠశాలలో జరిగిన సంఘటన పై విచారణ జరపాలని కలెక్టర్ ఆదేశించడంతో మొదటగా విద్యార్థినులను, విద్యార్థినిల తల్లిదండ్రులను విచారించడం జరిగిందని, అనంతరం ఉపాధ్యాయులను, పిఈటి ని సైతం విచారించి వారందరి నివేదికను తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యాయులలో కమ్యూనికేషన్ లోపం కనబడుతుందని అన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపించడం జరుగుతుందని చెప్పారు.గురుకుల పాఠశాలల సెక్రటరీ కి సైతం నివేదిక పంపిస్తామని తెలియచేశారు.
పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి..
సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్
పాఠశాలలో విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని, సుమారు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్న పాఠశాలలో సీసీ కెమెరాలు సైతం సరిగా పనిచేయడం లేదని, పాఠశాల గదులలో ఫ్యాన్ లు కూడా లేవని అన్నారు. సంబంధంలేని విషయంలో విద్యార్థులను చితక బాధడం నేరమని వెంటనే సంబంధిత అధికారులు అట్టి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
