ఇంటర్ బోర్డు ఎత్తేస్తారా…?
ఇంటర్ ఫలితాల్లో గందరగోళం…విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో బోర్డు వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీరియస్ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఇంటర్ ఫలితాల్లో దొర్లిన తప్పులపై ఆందోళన కొనసాగుతుండగా ఫెయిల్ అయ్యామనే ఆందోళనతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి బుధవారం తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అసలు ఫలితాల ప్రకటనలో తప్పులు ఎలా దొర్లాయని ప్రశ్నించారు. పేపర్లు దిద్దడంలో ఏజెన్సీ గందరగోళానికి పాల్పడిందా…అసలు లోపం ఎక్కడుందని ఆయన ఆరాతీసినట్లు సమాచారం. విద్యాశాఖపై సీఎం సమీక్ష అనంతరం ఇంటర్ బోర్డు ఎత్తివేయనున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా జరుగుతోంది. ఇంటర్ పరీక్ష ఫలితాలు, గందరగోళం తరువాత పరిణామాలపై సీఎం కేసిఆర్ సీరియస్ అయ్యారని ఇంటర్ బోర్డును ఎత్తివేసి 12వ తరగతి వరకు ఒకే బోర్డును ఏర్పాటు చేయనున్నారని ఊహగానాలు బయలుదేరాయి. తెలంగాణ స్టేట్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పేరుతో ఏర్పాటు చేయనున్నారని అంటున్నారు.