అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు….
పనులు పూర్తి చేయాలంటున్న స్థానికులు
రామకృష్ణాపూర్,నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆదివారం అంబేద్కర్ వార సంత సమీపంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పనుల పూర్తి విషయంలో ఎవరూ చొరవ చూపడం లేదు. రామకృష్ణాపూర్ పట్టణంలో కూరగాయల, మాంసం, చేపల విక్రయానికి నిర్ధిష్ట స్థలాలు లేక రోడ్లపై విక్రయిస్తున్నారు. దాంతో దశాబ్దాల కాలంగా విక్రయదారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుబజార్ నిర్మించాలని దశాబ్దకాలంగా స్థానికులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దాంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రామకృష్ణాపూర్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి రూ 7.50 కోట్లు మంజూరు చేసింది. స్థానిక సంత సమీపంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు స్థలం కేటాయించారు. మార్కెట్ నిర్మాణానికి గత ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక ,ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తో కలిసి అప్పటి చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ శంకుస్థాపన చేశారు. గతేడాది పనులు ప్రారంభించి స్లాబ్‌ల వరకు నిర్మాణం చేపట్టారు. నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ ఐదు నెలల క్రితం పనులు నిలిపివేశారు. నిధులు విడుదలైతే కాని పనులు ప్రారంభించేలా లేరు. అసంపూర్తి పనులు పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
ఈవిషయమై మున్సిపల్ ఏఈ అచ్యుత్ ను వివరణ కోరగా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిధులు నిలిపివేసిందని,అందువలననే నిర్మాణ పనులు ఆగాయని ప్రభుత్వం నుండి బడ్జెట్ విడుదలై ఆదేశాలు రాగానే
నిలిచిపోయిన పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు.