ఆర్థిక భారంతో ‘ఇందిరమ్మ’ లబ్ధిదారులు
◆:- సొంతింటి కల నెరవేరేనా!
◆:- పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు
◆:- బేస్మిట్ లెవెల్ కే రెండు లక్షలు దాటుతున్న పరిస్థితి!
◆:- నేటికీ అందని ఉచిత ఇసుక!
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటే సొంత ఇంటి కల నెరవేరడం ఖాయమని, అవసరమైతే లబ్దిదారుడిపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తామని ఎన్నికల ముందు చెప్పిన మాటలు ప్రచారాలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు మండల వ్యాప్తంగా విస్తారంగా వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం అందిస్తామన్న ఉచిత ఇసుక అందలేదు. మండలానికి 583 ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా ఇప్పటి వరకు 380 ఇండ్ల పనులు ప్రారంభమైనాయి.
పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలు
విస్తారంగా కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఓవైపు ఇసుక, మరోవైపు కంకర, సిమెంట్, స్టీల్ ధరలు మూడింతలు పెరగడంతో ఇందిరమ్మ లబ్దిదారులు ఆర్ధిక భారంతో సతమతమవుతున్నారు. దీంతో ఇండ్ల నిర్మాణ పనులలో వేగం తగ్గింది. ప్రభుత్వం ఇందిరమ్మ లబ్దిదారులకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని చెప్పినా నేటి వరకు అందలేదు. కనీసం ఇసుకైనా ఉచితంగా అందితే కొంతమేర భారం తగ్గుతుందని లబ్దిదారులు వాపోతున్నారు. మరో వైపు ఉన్నత అధికారుల నుంచి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని లబ్దిదారులకు ఒత్తిళ్లు రావడంతో ఎం చేయాలో తోచని పరిస్థితులు
నెలకొంటున్నాయని వాపోతున్నారు. ఒకానొక దశలో అధికారులు లబ్దిదారులకు చేతులు జోడించి తమకు పైనుంచి వస్తున్న ఒత్తిళ్లను అర్ధం చేసుకోవాలని వేడుకొంటున్నారు. లేనిపక్షంలో బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్న పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంటున్నారు. దీంతో లబ్దిదారులు ఏం చేయలేక పెరిగిన ధరలతో అనుకున్న అంచనా కంటే అధికంగా ఖర్చులు అవుతున్నాయని ఏం చేయాలో అర్ధం కావడంలేదని అధికారులకు లబ్దిదారులు మొరపెట్టుకుంటున్నారు.
ఉచిత ఇసుక సరఫరా అయ్యేనా !
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని తెలిపినా ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమై రెండు నెలలు గడిచినా నేటికీ ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదని లబ్దిదారులు వాపోతున్నారు. ఉచిత ఇసుక సరఫరా అనేది మండల స్థాయిలో తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఒక పాయింట్ని ఏర్పాటు చేసి అక్కడి నుండి మండలంలోని వివిధ గ్రామాలకు సరఫరా చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆ ప్రక్రియ నేటికీ ప్రారంభం కాకపోవడంతో లబ్దిదారులు నిరాశ చెందుతున్నారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రశ్నార్ధకంగా మారాయి. కొందరు లబ్దిదారులు మొదటి బిల్లుతో బేస్మెంట్ వరకు పనులు చేసి నిలిపివేస్తే, మరికొందరు పిల్లర్లను నిర్మించి పనులను అక్కడే నిలుపుదల చేసిన పరిస్థితులు నెలకొన్నాయి.
త్వరలో ఉచిత ఇసుక అందజేస్తాం
-ఎంపీడీఓ, మంజుల, ఝరాసంగం
ఇందిరమ్మ అబ్దిదారులకు త్వరలో ఉచిత ఇసుక అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల నుండి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వివరాలు సేకరించాం. దీని ప్రకారం ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక్కొక్క ఇందిరమ్మ ఇంటికి 40 టన్నుల ఉచిత ఇసుక అందిచే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం.