
ఎడతెరిపి లేని వర్షం…జనం అతలాకుతలం
◆- పొంగిన వాగులు
◆- నీట మునిగిన పంటలు
◆- జలమయంగా జహీరాబాద్ పట్టణ రోడ్లు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో సోమవారం మధ్యాహ్నం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ప్రజలు అతలకుతలమవుతున్నారు.
గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో అడపాదడపగా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.దీనికి తోడు సోమవారం మధ్యాహ్నం నుండి నియోజకవర్గంలోని ఝరాసంగం,జహీరాబాద్
,న్యాల్కల్,మొగుడంపల్లి, కోహీర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది.దీంతో ఆయా మండలాల్లో ఉన్న వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే కొన్ని చెరువులు నిండి అలుగులు పారుతుండగా మరికొన్ని చెరువుల్లో భారీ వరద నీరు వచ్చి చేరింది.
కాగా సోమవారం వర్షానికి ఝరాసంగం మండలంలోని ప్యాలవరం వాగు ప్రవహించడంతో జీర్లపల్లి చెరువు నిండి అలుగు పొర్లింది.అలాగే వాగులు ప్రవహించడంతో న్యూ ట్యాంక్ మేదపల్లి,వనంపల్లి ప్రాజెక్టు,ఈదులపల్లి,
చిల్కేపల్లి తదితర గ్రామాల చెరువులోకి కూడా భారీ వర్షం నీరు వచ్చి చేరింది.నారింజ వాగు ప్రవాహంలో పొట్టిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొట్టుకుపోయి గలంతయ్యాడు.దీంతో ఆయా గ్రామాల వాగుల వద్దకు వెళ్లి ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
కాగా నియోజకవర్గంలోని ఇంకా ఆయా మండలాల్లో కూడా చెరువులు,కుంటలకు జలకళ సంతరించుకుంది.చెక్ డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి.అదేవిధంగా నారింజ వాగు నిరంతరంగా ప్రవహించడంతో కొత్తూరు నారింజ వాగు ప్రాజెక్ట్ నిండడంతో అధికారులు నీటిని దివకు వదిలిపెట్టారు.భారీ వర్షాలతో పంట పొలాలు నీట మునిగి తీవ్ర నష్టం సంభవించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా భారీ వర్షాలతో జహీరాబాద్ పట్టణ వీధులు చిత్తడి చిత్తడిగా మారి ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.పట్టణంలో పూర్తిస్థాయిలో సీసీ రోడ్డు లేకపోవడంతో మట్టిరోడ్లే ప్రజలకు దిక్కుగా మారాయి.ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఈ దారులు బురదమయంగా మారడంతో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. పట్టణంలోని రాంనగర్ నుండి తాండూర్ వైపు వెళ్లే బీటీ రోడ్డు గుంతలు పడి ప్రమాదకరంగా మారింది.ఈ రోడ్డుపై అక్కడక్కడ భారీ వర్షం నీరు నిలుచుని వాగుల దర్శనమిస్తుంది.రాంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో జాతీయ రహదారిపై భారీ వర్షం నీరు నిల్చోడంతో రాకపోకలు సాగించడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పట్టణంలోని సంఘమిత్ర స్కూల్ నుండి ఆదర్శనగర్ మీదుగా చెన్నారెడ్డి కాలనీ వైపుగల మట్టి రోడ్డు చిత్తడి చిత్తడి గా మారి వాహనాల మాట ఎలా ఉన్నా కనీసం కాలినడకన వెళ్లాలన్న అనువుగా లేకుండా పోయింది.అలాగే బ్లాక్ రోడ్డు,తహసిల్దార్ కార్యాలయం వైపు వెళ్లే రోడ్లపై అక్కడక్కడ నీరు నిల్చడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ఇంకా చాలా కాలనీల పరిస్థితి ఇదే విధంగా ఉండటంతో నిత్యం ప్రజలు పాట్లు పడుతున్నారు.కాగా నియోజకవర్గంలోని ఆయా మండలంలో గల పలు గ్రామాల రోడ్లు కూడా బురదతో చిత్తడి చిత్తడిగా మారి ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.