పంటల భీమా అమలు చేసి రైతును రక్షించాలి
ఆర్డీవో కు వినతి పత్రం అందజేసిన వరికేల కిషన్ రావు
పరకాల నేటిధాత్రి
రైతుల రక్షణ కొరకు పంటల బీమా అమలు చేసి వారి భద్రతకు తోడ్పడాలని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికేల కిషన్ రావు ప్రభుత్వాన్ని కోరారు.గురువారం రోజున రైతులతో కలిసి పరకాల ఆర్డిఓ కే. నారాయణ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కిషన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సీజన్ ప్రారంభమైన ఇంతవరకు పంటల బీమా అమలు లేక రైతులు తీవ్ర నష్టపోతున్నారని అన్నారు.ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే రైతులు అప్పులు తీర్చలేక,యజమానికి కౌలు చెల్లించలేక,తదుపరి పంటలకు పెట్టుబడి లేకుండా, కుటుంబ ఖర్చులకు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఒకసారి పంట నష్టపోయిన రైతు తిరిగి స్థిర పడటానికి మూడు నాలుగు వంటకాలాల సమయం పడుతుందని,అలాంటి పరిస్థితుల్లో పంటల బీమా రైతుకు ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంట రుణమాఫీ,రైతు భరోసా పథకాలతో రైతులకు మంచి సంకేతాలు పంపిందని,అదే స్ఫూర్తితో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరి పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చౌల రామారావు,రవీందర్,రఘు,కానూరు వీరస్వామి,రైతులు పాల్గొన్నారు.