దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించిన గండ్ర జ్యోతి
శాయంపేట మండలకేంద్రంలో రెండవ విడత జరుగుతున్న ప్రాదేశిక పోలింగ్ సందర్భంగా శాయంపేట-2 ఎంపీటీసీ బిజెపి అభ్యర్థి కోడెపాక స్వరూప ఓటర్లకు బిజెపికి ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి, శాయంపేట జడ్పీటిసి టిఆర్‌ఎస్ అభ్యర్థి గండ్ర జ్యోతి మండలకేంద్రంలో స్వరూప వద్దకు వెళ్లి ఇక్కడ ఇంకా బిజెపి ఉందా…బిజెపి ఎక్కడిది…బిజెపికి ఓటు వేయాలని అడుగుతున్నావా…చెప్పుతో కొడతా…అంటూ దళిత మహిళ అయిన స్వరూపను ఇష్టం వచ్చినట్లు తిట్టిందని బిజెపి ఎంపీటీసీ అభ్యర్థి కోడెపాక స్వరూప తెలిపారు.
ఈ సందర్భంగా కోడెపాక స్వరూప మాట్లాడుతూ శుక్రవారం పోలింగ్ కేంద్రం వద్ద తాను ఓటర్లకు పువ్వుగుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా గండ్ర జ్యోతి తన వద్దకు వచ్చి దళిత మహిళనైన నన్ను చెప్పుతో కొడతానని ఇష్టంవచ్చినట్లు తిట్టిందని ఆరోపించింది. గతంలో తాను ఉపసర్పంచ్‌గా పనిచేసిన విషయాన్ని కూడా మరచి నన్ను చెప్పుతో కొడతానని అనడం టిఆర్‌ఎస్ పార్టీ దౌర్జన్యానికి అగ్రకుల అహాంకారానికి గండ్ర జ్యోతి వ్యవహారించిన తీరే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్నికల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.