
Walking after dinner
రాత్రి పూట డిన్నర్ చేశాక వాకింగ్ చేస్తే.. ఎన్నో అద్భుతమైన ఫలితాలు..!
జహీరాబాద్ నేటి ధాత్రి:
మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలన్న సంగతి తెలిసిందే. అయితే వ్యాయామం అంటే మరీ కష్టపడి జిమ్‌లలో కసరత్తులు చేయాల్సిన పనిలేదు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు సాధారణ వాకింగ్ చేసినా చాలు. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం వాకింగ్ చేయడం వల్ల రోజంతా మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. ఇది క్యాలరీలను కరిగిస్తూనే ఉంటుంది. కనుకనే ఉదయం వ్యాయామం చేయాలని వైద్యులు చెబుతుంటారు. అయితే కేవలం ఉదయం మాత్రమే కాదు.. రాత్రి పూట భోజనం అనంతరం కూడా వాకింగ్ చేయాలి. దీంతో మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రాత్రి పూట డిన్నర్ చేసిన అనంతరం వాకింగ్ చేయడం ఎన్నో మంచి ఫలితాలను ఇస్తుందని వారు అంటున్నారు.
అధిక బరువు, షుగర్ లెవల్స్..

రాత్రి పూట భోజనం చేసిన అనంతరం కనీసం 10 నిమిషాల పాటు తేలికపాటి నడక కొనసాగించాలి. రాత్రి పూట మన మెటబాలిజం తగ్గుతుంది. కానీ వాకింగ్ చేస్తే మెటబాలిజంను పెంచుకోవచ్చు. దీంతో రాత్రి మనం నిద్రించినా కూడా మన శరీరం క్యాలరీలను ఖర్చు చేస్తూనే ఉంటుంది. ఫలితంగా మనం నిద్రలో ఉన్నా కూడా మన శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా రాత్రి పూట డిన్నర్ తరువాత వాకింగ్ చేస్తే ఎన్నో మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక రాత్రి పూట భోజనం అనంతరం వాకింగ్ చేయడం వల్ల షుగర్ లెవల్స్‌న అదుపులో ఉంచుకోవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం రాత్రి డిన్నర్ తరువాత వాకింగ్ చేసేవారి ఫాస్టింగ్ షుగర్ లెవల్స్ చాలా వరకు తగ్గాయని తేల్చారు. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఫాస్టింగ్ షుగర్ లెవల్స్‌ను తగ్గించుకునేందుకు గాను రాత్రి పూట డిన్నర్ చేసిన అనంతరం వాకింగ్ చేయాలి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేసే విషయం.