మీరే నా బలం మీరే నా బలగం
అభివృద్ధి కోసం ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి
ఇల్లందకుంట రామాలయాన్ని మినీ యాదగిరిగుట్ట చేస్తా హుజురాబాద్ నియోజకవర్గం, బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మీరంతా నా వెంట ఉండి నన్ను గెలిపిస్తే మీ కష్టసుఖాల్లో నేను ఉంటానని ఎమ్మెల్సీ, నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలోనే ఉంటూ ఏ ఇంట్లో కష్టమొచ్చిన మీరు ఏడిస్తే ఏడ్చాను నవ్వితే నవ్వాను అని అన్నారు. ఇప్పుడు మీరే నా బలం మీరే నా బలగం మీరు నా వెంట ఉంటే ఎంత దూరమైనా వెళ్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలంతోపాటు శ్రీరాములపల్లి,కనపర్తి ,ల క్ష్మాజిపల్లి, మల్యాల గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇల్లందకుంటను టెంపుల్ సిటీగా ప్రకటించామని, దీంతోపాటు ఇల్లందకుంట రామాలయాన్ని మినీ యాదగిరిగుట్టగా మారుస్తానని చెప్పారు. బీరన్న గుడికి కూడా 10 లక్షల రూపాయలు కేటాయించమన్నారు. ఇల్లందకుంట పాత శివలయాన్ని కొత్తగా మారుస్తామన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 19 వేల కోట్ల రుణమాఫీ చేసిన గొప్ప నాయకుడు కేసిఆర్ అన్నారు. ఇప్పటికే 14 వేల కోట్లు రుణమాఫీ చేశాడని మిగిలిన 5000 కోట్లు కూడా వారం పది రోజుల్లో రుణమాఫీ చేస్తాడని తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి వారి ఎదుగుదలకు కారణమయ్యాడని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల మనసు గెలుసుకున్నాడన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించే బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ మరోసారి పేద ప్రజల కోసం మేనిఫెస్టో రూపొందించారనన్నారు, ఈ మేనిఫెస్టో పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతాయన్నారు. గత ఏడుసార్లు ఇక్కడి ఎమ్మెల్యే ఈటలకు అవకాశం కల్పించిన హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయాడని, నాకు ఒకే ఒక్క అవకాశం ఇస్తే హుజురాబాద్ రూపు రేఖలు మార్చి చూపిస్తానని నమ్మ బలికారు. హుజురాబాద్ ని సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తానని, అలా చేయకుంటే మరోసారి మీ ముందుకు వచ్చి ఓటు కూడా అడగనన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో పాటు కుల భవనాలు, మహిళా భవనాలతో పాటు రోడ్లు ,డ్రైనేజీలు అన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. అంతేకాకుండా గృహలక్ష్మి, బిసి లోన్లు పెట్టుకున్న వారికి కూడా అందరికీ అమలు చేస్తున్నామని, డిసెంబర్ 3 తర్వాత చెక్కులు కూడా పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ పావని వెంకటేష్, ఇల్లందకుంట గ్రామ అధ్యక్షుడు విక్రమ్, ఎంపీటీసీ కుమార్, కొమురెల్లి, శ్రీరాములపల్లి సర్పంచ్ మొగిలి, గ్రామ అధ్యక్షుడు రవీందర్, ఉప సర్పంచ్ ఆగన్న, కనపర్తి సర్పంచ్ మట్ట రజిత-వాసుదేవరెడ్డి, ఎంపిటిసి రమ, నాయకులు దరువుల రాకేష్, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.