ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి

హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డి

హనుమకొండ, నేటిధాత్రి :

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్‌ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోపు తెలియజేయాలని అదనపు కలెక్టర్‌ వెంకటరెడ్డి రాజకీయ పార్టీలను కోరారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్‌ పర్యవేక్షణలో ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల జాబితాను రూపొందించడం జరిగిందన్నారు. ఇప్పటికే ఈ నెల 7 వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ముసాయిదా జాబితాను ప్రకటించామని గుర్తు చేశారు. జిల్లాలో మొత్తం 210 గ్రామ పంచాయతీలు, 1986 వార్డులు ఉండగా, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను అనుసరిస్తూ 1986 పోలింగ్‌ కేంద్రాలను గుర్తిస్తూ ముసాయిదా జాబితాను రూపొందించామని వివరించారు.
ఈ ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 12 వ తేదీలోపు తెలుపవచ్చని, 12న అన్ని మండలాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎంపీడీఓలు నిర్వహించే సమావేశంలోనూ అభ్యంతరాలు స్వీకరిస్తారని అదనపు కలెక్టర్‌ తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను 13వ తేదీన పరిష్కరించడం జరుగుతుందని, జిల్లా పాలనాధికారి ఆమోదం అనంతరం ఈ నెల 17న అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో తుది పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రకటించబడుతుందని అన్నారు.
ఈ సమావేశంలో డీపీఓ లక్ష్మి రమాకాంత్‌, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు కాంగ్రెస్‌ శ్రీనివాస్‌, బి.జె.పి. నిశాంత్‌, ఎ.ఐ. ఎం.ఐ.ఎం. సుభాని, వైఎస్‌ఆర్‌ సిపి. రజినీకాంత్‌, టి.డి.పి శ్యామ్‌, సి.పి.ఎం. వెంకట్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!