Gas Leak Fire Leaves Families Homeless
గ్యాస్ లీకేజీతో అగ్ని ప్రమాదం కాలిపోయిన గుడిసెలు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి రూరల్
మండలం గొర్లవీడు తండాలో శుక్రవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం రెండు కుటుంబాలను నిరాశ్రయులుగా మిగిల్చింది.భూక్యా పుల్లమ్మ భూక్య సునీత రాజుల ఇల్లు గ్యాస్ లీకేజీతో అగ్నికి ఆహుతయ్యాయి. ఉదయం వేళలో వ్యవసాయ పనుల కోసం వెళ్లగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ఇంట్లో ఉన్న పిల్లలు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రాణాలు దక్కించుకున్నా, కళ్లముందే గుడిసెలు దగ్ధమవుతుండటం వారిని కంటతడి పెట్టించింది.భూక్యా రాజుకు చెందిన గుడిసెలో ఉన్న రూ.50 వేలు నగదు, ట్రాక్టర్ పత్రాలు, భూమి డాక్యుమెంట్లు, ఇంటి సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. భూక్యా శ్రీను గుడిసెలో ఉన్న రూ.1 లక్ష నగదు, భూమి పత్రాలు, గృహోపకరణాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.

సంవత్సరాల కష్టం క్షణాల్లో బూడిద కావడంతో బాధితులు తీవ్ర వేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. అగ్ని ప్రమాదంతో అన్నీ కోల్పోయిన ఆ కుటుంబాలు ఇప్పుడు ప్రభుత్వం, దాతల సహాయానికై ఎదురు చూస్తున్నాయి.
