8 Vasantalu Review: ‘8 వసంతాలు’ ఎలా ఉందంటే
‘మను’, ‘మధురం’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘8 వసంతాలు’.
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది?
ఫణీంద్ర నర్సెట్టి హిట్ అందుకున్నాడా?
రివ్యూలో చూద్దాం.
సినిమా రివ్యూ: 8 వసంతాలు (8 Vasantalu Movie Review)
విడుదల తేది: 20–6–2025
‘మను’, ‘మధురం’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narsetti) తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘8 వసంతాలు’.
అనంతిక సనీల్‌కుమార్(ananthika sanilkumar), రవి దుగ్గిరాల, హనురెడ్డి, కన్నా పసునూరి కీలక పాత్రధారులు.
చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కంటెంట్ బేస్డ్ సినిమాలకు పట్టం కడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రమిది.
ఫస్ట్ లుక్ నుంచి ప్రచార చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా వైపు తిప్పుకొన్నాయి.
నిర్మాణ సంస్థకు ఉన్న క్రేజ్‌తో సినిమాకు బజ్ పెరిగింది.
శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు మెప్పించింది?
ఫణీంద్ర నర్సెట్టి హిట్ అందుకున్నాడా?
రివ్యూలో చూద్దాం.
కథ : (8 Vasantalu Story)
శుద్థి అయోధ్య (అనంతిక సనీల్ కుమార్) స్ట్రాంగ్ లేడీ.
చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తన అనుభవాల సమాహారంగా పదిహేడేళ్లకే భావోద్వేగభరితను ఓ పుస్తకంగా రాస్తుంది.
అది చదివి ఎంతోమంది ఆమెకు అభిమానులుగా మారతారు. ఆమెలో చక్కని రచయిత్రే కాదు..
తల్లి ప్రేమ, బాధ్యత, మార్షల్ ఆర్ట్స్ గురువు అంటే గౌరవం, స్నేహితుల పట్ల కరుణ ఉంచే స్వభావం కలది.
మార్షల్ ఆర్ట్స్‌లోనూ మంచి ప్రావీణ్యం ఉన్న అమ్మాయి శుద్ధి.
ఓ రోజు మార్షల్ డోజోలో వరుణ్ (హను రెడ్డి) పరిచయం అవుతాడు.
చూసిందే తడవు..
ఆమె ప్రేమకోసం తపిస్తూ వెంటపడతాడు.
కొంత సమయంలో తర్వాత ఆమె తనపై ప్రేమను పెంచుకుని చెప్పేలోపు వరుణ్ బర్క్లీలో తన గోల్ సాధించడం కోసం ఆమెను వదిలించుకుని విదేశాలకు వెళ్లిపోతాడు.
పగిలిన గుండెతో ఆమె మరో పుస్తకం రాస్తుంది.
తదుపరి ఊటీలో తెలుగు రచయిత సంజయ్ (రవి దుగ్గిరాల) పరిచయం అవుతాడు.
అతనిని శుద్ధి ప్రేమిస్తుంది.
తల్లికి చెబుదామనుకునేలోపు తల్లి ఆరోగ్యం బాగోకపోవడం, ఎస్టేట్స్ చూసుకునే బాధ్యత మీద పడటంతో తన ప్రేమ సంగతి తల్లికి చెప్పలేకపోతుంది.
తల్లి ఉన్న పరిస్థితిని బట్టి తన ప్రేమను త్యాగం చేయాలనుకుంటుంది.
సంజయ్ ఆమె ప్రేమను గెలిచాడా?
8 వసంతాలకు, సంజయ్‌కు సంబంధం ఏంటి?
అన్నది కథ.
‘మను’, మధురం వంటి చిత్రాల దర్శకుడి నుంచి వచ్చిన ప్రేమకథ ఇది.
గతంలో ఆయన తీసిన సినిమాల రిజల్ట్ బాధ పెట్టి ఉండొచ్చు.
ఆ కసితోనే 8 వసంతాలు చిత్రాన్ని తీసినట్లు సినిమా ప్రారంభంలో అనిపిస్తుంది.
2013 నుంచి 2020 మధ్యలో జరిగే ఓ సున్నిత ప్రేమకథ ఇది.
స్ట్రాంగ్ అండ్ టాలెంటెడ్ లేడీకి జీవితంలో ఎదురైన చేదు జ్ఞాపకాల నేపథ్యంలో ఓ ప్రేమకథగా మలిచారు దర్శకుడు.
సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకూ ఫ్లో బావుంది.
అయితే అక్కడక్కడా కాస్త సాగదీతగా ఉన్నా..
శుద్ధి పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారీ సాగదీత అనేది గుర్తుకు రాదు.
దర్శకుడు పూర్తిగా కవితాత్మక కథ తెరపై చూపించాలనుకున్నాడు.
ఆ తరుణంలో అతనిలోని రచయిత దర్శకుడిని డామినేట్ చేసిన భావన కలుగుతుంది.
మాటలు బాగా రాసుకున్నాడు అయితే తన రాతతో కథను మించి కవిత్వం పెరిగింది.
ప్రాసల కోసం తపన కనిపించింది.
కొన్ని సందర్భాల్లో డైలాగ్ నలిగిపోయింది.
దాని వల్ల క్యారెక్టర్స్ మీద ఉన్న ఎఫెక్ట్ తగ్గిందనిపిస్తుంది.
తండ్రి మరణం, ఆ తర్వాతి సంఘటనలు శుద్ధికు రైటర్‌గా జన్మ ఇచ్చింది.
వరుణ్‌తో లవ్ ట్రాక్ బావుంది.
ఆమె ప్రేమను చెప్పాలనుకునే లోపు అతను విడిచివెళ్లిపోయాడు.
వరుణ్ క్యారెక్టర్ ఎంట్రీ, అతని రన్ చూస్తే నెగటివ్ అని గెస్ చేసేలా ఉంది.
ఇంటర్వెల్ వరకూ సినిమా ఒకలా ఉంటే..
అక్కడి మరోలా ఉంది.
తనని వదిలించుకుని వెళ్లున్న వరుణ్‌కి వర్షంలో నిలబడి చెప్పే డైలాగ్‌లో ప్రేక్షకుల హృదయాన్ని కదిలిస్తాయి.
‘మనిషికి మనిషి దూరంగా ఉన్నా..
దగ్గరగా ఉన్నా డిగ్నిటీ మాత్రం మారకూడదు’ అంటూ తల్లి గురించి చెప్పే డైలాగ్‌లు,
‘నేను వద్దు అనుకున్నానంటే నేను వేసుకున్న దుస్తులు పొరపాటున గాలి వల్ల కూడా నీ వైపు రావు. అంత స్ట్రాంగ్ నేను’
అంటూ మహిళల్ని మహారాణిలా పోలుస్తూ రాసిన డైలాగులు పేలాయి. ఆ డైలాగ్‌లు చప్పట్లు కొట్టించాయి.
తర్వాత ఇంటర్వెల్..
మార్షల్ ఆర్ట్స్ గురువు మరణం, అస్తికలు కలపడానికి కాశీకి వెళ్తే అక్కడ చేదు అనుభవం, సంజయ్ ఎంట్రీ, తల్లి అనారోగ్యం ఇవన్నీ పార్టుపార్టులుగా కథను, రన్నింగ్ ఫ్లోన్ డల్ చేసేశాయి. కాశీలో శుద్ధి తీసిన యాక్షన్ సీన్ బావుంది.
కానీ అంత యాక్షన్ పార్ట్ అవసరం లేదేమో అనిపిస్తుంది.
అమ్మాయి ఎంత స్ట్రాంగ్ అయినా లోపల సున్నితత్వం అనేది ఒకటి ఉంటుంది.
అలాంటి అమ్మాయి గుండెకు ప్రేమ పేరుతో బలమైన గాయమైనప్పుడు మళ్ళీ ప్రేమలో పడాలంటే ఎంత ఆలోచించాలి?
ఎంత బలమైన సిచ్చువేషన్ క్రియేట్ చేయాలి.
కానీ ఇక్కడ దర్శకుడు దానిని మిస్ చేశాడు.
ఓ వేశ్య కథకు అక్షర రూపం ఇవ్వడంతో పాటు పాఠకులలో ఆశ నింపాలని చూసిన ఓ రచయితను చూడగానే మనసిచ్చేస్తుంది శుద్ధి.
రెండో విజిట్‌కే ప్రేమమైకంలో పడుతుంది. అది సహజంగా లేదు.
నమ్మసఖ్యంగా లేదు.
రచయిత రాసిన మాటలు ప్రేక్షకుడి మదిలో రిజిస్టర్ అయ్యేలా రాయాలి, కానీ రిజిస్టర్ అవ్వడం కోసమే మాటలు రాయకూడదు.
కానీ దర్శకుడు ఇక్కడ అదే చేశాడు.
ఓ బుక్ స్టోర్‌లో మా రోజుల్లో చలంకు అమ్మాయిల్లో ఇంత క్రేజ్ ఉండేది..
ఇప్పుడు ఈ అబ్బాయికి’ అని ఇద్దరు మహిళలు మాట్లాడుకోవడం, ఓ సందర్భంలో ప్రేమికుడిని చెరకు తోటలో పడిన ఏనుగుతో పోల్చారు’ అని జనాలు యాక్సెప్ట్ చేసేలా లేవు.
కొన్ని సందర్భాల్లో పాత్రలు తమ వయసుకు మించి మాట్లాడుతున్న భావన కలుగుతుంది.
నటీనటులు పనితీరు..
శుద్థి అయోధ్య పాత్రలో అనంతిక సనీల్ కుమార్ అద్భుతంగా నటించింది.
హవభావాలు అద్భుతం. ప్రేక్షకుడి కన్ను తిప్పుకోనివ్వకుండా ఆమె నటన ఉంది.
ప్రతి సీన్లోను మెప్పించింది. ఒకటి రెండు సన్నివేశాల్లో ఎమోషన్ క్యారీ చేయలేకపోయిందనిపించింది.
పాత్ర పరంగా ఆమె ఈ సినిమాకు బిగ్ ఎసెట్. హను రెడ్డి వరుణ్ పాత్రకు న్యాయం చేశాడు.
అనంతిక, హనురెడ్డి పెయిర్ తెరపై బావుంది.
ఇద్దరి మధ్య యాక్టింగ్ కెమిస్ట్రీ బావుంది.
సెకెండాఫ్‌లో వచ్చిన రవి దుగ్గిరాల నటనలో ఇంకా బాలుడే.
ఇంప్రూవ్ కావాలి.
శుద్ధి స్నేహితుడి కన్నా పసునూరి కార్తిక్ పాత్రకు న్యాయం చేశాడు.
మిగతా నటీనటుల్లో గుర్తు పెట్టుకునేవారు ఎవరూ లేదు.
తమ పరిధి మేరకు యాక్ట్ చేశారు.
దర్శకుడికి మంచి టీమ్ కుదిరింది.
సినిమాటోగ్రాఫర్ విశ్వనాధ్రెడ్డి విజువల్ పరంగా ఎక్కడా పేరు పెట్టకుండా ప్రతీ సీన్‌ను అందంగా క్యాప్చర్ చేశారు.
అలాగే సినిమాకు మ్యూజిక్ ఎసెట్.
హేషమ్ అబ్దుల్ వాహబ్ చక్కని పాటలు, ఆర్ఆర్ అందించారు.
సాహిత్యం బావుంది.
ఎడిటర్ శశాంక్ మాలి సెకెండాఫ్‌కు కాస్త కత్తెర వేసుంటే బావుండేది.
దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి సినిమాను బాగానే గ్రాండ్‌గా తీశారు.
నిర్మాతలు ఖర్చు తెరపై కనిపించింది.
రచనపై ఎక్కువ దృష్టి పెట్టడంతో సినిమా మధ్యలో డ్రాప్ అయింది.
ఇంటర్వెల్, క్లైమాక్స్ అద్భుతం అనేలా తీశారు.
ఆ రెండు సీన్స్ చాలు సినిమాకు హిట్టుకు అనుకున్నారో ఏమో?
ఎక్కువ దృష్టి అక్కడే పెట్టి మిగిలినది సోసోగా కానిచ్చారు.
కానీ ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేవు.
పొయిటిక్ లవ్‌స్టోరీగా తీసే ప్రయత్నం చేశారు కాబట్టి కామెడీకి ఎక్కడా చోటు ఇవ్వలేదు.
8 ఏళ్ల ప్రేమకథను దర్శకుడు సున్నితంగా చూపించారు కానీ..
అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు.
సింపుల్, కూల్ లవ్‌స్టోరీలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.
కమర్షియల్ యాక్షన్ హంగామా కోరుకునే ప్రేక్షకుల నుంచి ఆదరణ తక్కువే ఉంటుంది.