ఫిబ్రవరి, 21 తేదీన హాజరు కావాలని హైకోర్టు ఆదేశం:-
వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-
ఒక సివిల్ తగాదా లో హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ దానిని అమలు చెయ్యకుండా పిటిషనర్ల మీదనే కేసు నమోదు చేసిన విషయంలో గౌరవ హైకోర్టు మిల్స్ కాలనీ సిఐ వెంకట రత్నం మరియు ఎస్ ఐ శ్రీకాంత్ లకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే ఏలుకుర్తి వాల్మీకి మరియు వారి కుటుంబ సభ్యులు తమకున్న ఫోర్ట్ వరంగల్ లో గల దూపకుంట లో సర్వే నెంబర్ 1263 (పాతది) 740 (కొత్తది) లో 2- 00 ఎకరాల భూమి కలదు. ఇట్టి భూమి పైకి బత్తుల సంపత్ కుమార్ మరియు కొందరు వచ్చి ఆక్రమించే ప్రయత్నం చెయ్యడం వలన సీనియర్ సివిల్ జడ్జి, వరంగల్ కోర్టు లో బత్తుల సంపత్ మరియు అతని కుమారునిపై సివిల్ దావా వెయ్యడం జరిగింది, ఇందులో గౌరవ కోర్టు వారు వాల్మీకి వాళ్లకు ఇంట్రిమ్ జంక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఐనా బత్తుల సంపత్ మరియు అతని కుమారుడు భూమి పైకి దౌర్జన్యంగా రావడం వలన వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు గౌరవ హైకోర్టును ఆశ్రయించారు. గౌరవ హైకోర్టు వారు కింది కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను అమలు చెయ్యమని మిల్స్ కాలనీ పోలీస్ లను ఆదేశించింది. ఇట్టి విషయాన్ని వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు సిఐ దృష్టికి తీసుక పోయారు, కానీ ఇంతలో మళ్ళీ బత్తుల సంపత్ మరియు అతని కుమారుడు మళ్ళీ భూమి మీదకు వచ్చి దౌర్జన్యం చెయ్యగా వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు సిఐ గారిని ఆశ్రయించారు, కానీ సిఐ గారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా బత్తుల సంపత్ ఇచ్చిన దరఖాస్తు మీద వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యుల పై కేసు నమోదు చేశారు. ఇట్టి విషయంలో వాల్మీకి మరియు అతని కుటుంబ సభ్యులు మళ్ళీ గౌరవ హైకోర్టు ను ఆశ్రయించి పోలీసుల పై కోర్టు ధిక్కరణ కేసు వేశారు, గౌరవ హైకోర్టు తేదీ 24-01-2025 నాడు మిల్స్ కాలనీ సిఐ మరియు ఎస్ఐ లకు కోర్టు ధిక్కరణ నోటీస్ లు జారీ చేస్తూ ఈ నెల 21 తారీకున వ్యక్తిగతంగా కానీ లేదా న్యాయవాది ద్వారా కానీ హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.