గ్రేటర్‌లో దొంగల గ్యాంగ్
గ్రేటర్ నగరంలో దొంగల గ్యాంగ్ భయపెడుతోంది. 8మంది సభ్యులున్న ఈ గ్యాంగ్ తాళం వేసి ఉన్న, ఒంటరిగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రెండురోజుల క్రితం కాజీపేట చైతన్యపురి ప్రాంతంలో అర్థరాత్రి ఓ ఇంటి కిటికి ఊచలు కట్ చేస్తుండగా అప్రమత్తమైన ఇంటి యజమానులు గట్టిగా అరవడంతో దొంగలు పారిపోయినట్లు సమాచారం. వెంటనే తేరుకున్న ఇంటి యజమాని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్న ఈలోపే దొంగల గ్యాంగ్ పారిపోయింది. అయితే చైతన్యపురి ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పుటేజీ సంపాదించారు. ఈ పుటేజీ ఆధారంగా దొంగల వివరాలను సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. సీసీ టివి పుటేజి ఆధారంగా కూపి లాగుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కాజీపేట సీఐ అజయ్‌కుమార్
కాజీపేట పట్టణంలో దొంగల ముఠా తిరుగుతున్నట్లు ప్రజలు కాలనీలల్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలల్లో దొంగల ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రజలు బయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం కాజీపేట చైతన్యపురి కాలనీలో ఈ దొంగల ముఠా ఓ ఇంటలో దొంగతనానికి ప్రయత్నిస్తుండగా యజమాని అప్రమత్తమై వారిని ఎవరు అని ప్రశ్నించేలోపే వారు అక్కడి నుండి పరారయినట్లు పోలీసులు తెలిపారు. 100 డయల్ చేయడంతో కాజీపేట సీఐ అజయ్‌కుమార్ తన సిబ్బందితో వెళ్లి గాలించగా అప్పటికే దొంగలు పరారు అయ్చారని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా ‘నేటిధాత్రి’ ప్రతినిధితో సీఐ అజయ్‌కుమార్ మాట్లాడుతూ కాజీపేట పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే 100 డయల్ చేసి సమాచారమివ్వాలని అన్నారు. చైతన్యపురిలో దొంగతనానికి ప్రయత్నించిన దొంగలముఠా కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.