నడికూడ,నేటిధాత్రి:
మండల పరిధిలోని గ్రామాల్లో మిర్చి పంట పరిశీలన
ఆరుగాలం శ్రమించి లక్షల్లో పెట్టుబడి పెట్టి మిర్చిని పండిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలంగాణ రైతు రక్షణ సమితి(టీ ఆర్ ఆర్ ఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ రావు వాపోయారు.శనివారం ఆయన టీ ఆర్ ఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ తో కలిసి నడికూడ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మిర్చి పంటను పరిశీలించారు.రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు.అనంతరం కిషన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర సర్కారు మార్క్ ఫెడ్ ను వెంటనే రంగంలోకి దించి మిర్చి కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో మిర్చి ధర దయనీయ స్థితికి పడిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని పేర్కొన్నారు.మిర్చి ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లో ధర తగ్గడం
కారణం కానే కాదని స్పష్టం చేశారు.ఒక ఎకరానికి 35 నుండి 40 క్వింటాళ్లు సాధారణ దిగుబడి వచ్చేదని, ఇప్పుడు 15 నుంచి 25 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని చెప్పారు.ఒక ఎకరానికి సుమారు రూ.2 లక్షల పెట్టుబడిని రైతులు మిరప పంటపై దార పోశారని,ప్రస్తుతం మార్కెట్లో ధర చూస్తే కంటిమీద కునుకు రావడం లేదని తెలిపారు. గత సంవత్సరం మిరప ధర రూ.23 వేలు పలికిందని, ప్రస్తుతం రూ.12 వేలకు కూడా కొనుగోలు చేసే దిక్కు కూడా లేకపోవడం బాధాకరమన్నారు.
వ్యాపారులు,దళారులు, అధికారులు కుమ్మక్కై సిండికేట్ గా మారి మిర్చి రైతులకు నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు.కోల్డ్ స్టోరేజీల్లో సైతం రైతులకు అవకాశం ఇవ్వడం లేదని,అక్కడ కమీషన్ ఏజెంట్లతో కుమ్మక్కై రైతులకు స్టోరేజ్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రస్తుత మార్కెట్లో ఉన్న ధరను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.తమకు ఆత్మహత్య శరణ్యం అనే రీతిన పరిస్థితులు ఏర్పడ్డాయని విచారం వ్యక్తం చేశారు.తమది రైతు సర్కార్ అని పేర్కొనే ప్రభుత్వం మిర్చి రైతుల విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని అభ్యర్థించారు.సిండికేట్ వ్యవస్థకు అడ్డుకట్ట వేసి మిర్చి రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు,హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్,మండల ప్రధాన కార్యదర్శి టింకురాల రాజు, మొకిడి రాజయ్య,సురావు శంకర్రావు,మోకిడి రాజకుమార్,టేకురాల దేవా రావు,నాగూర్ల రాజీవ్,కర్ణాకర్, బొంపెల్లి శంకర్రావు, పలువురు రైతులు పాల్గొన్నారు.