విచ్చలవిడిగా కల్తీ అవుతున్న ఆహారం.. తనిఖీలు ఏవి….?
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: నేటి మనిషి ఉరుకులు పరుగుల
జీవితంలో తినే ఆహారాన్ని నాణ్యత ప్రమాణాలు తెలుసుకోకుండా ఎక్కడపడితే అక్కడ ఆహారాన్ని తీసుకుంటున్నారు. కల్తీ అని తెలుసుకోకుండా తినడంతో అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలవుతున్నారు. వ్యాపారస్తులు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఆశిస్తున్నారు. ఆహార భద్రతా నియమాలు పాటించడం లేదు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మారుమూల గ్రామాల్లో సైతం స్వీట్ హౌస్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మండల కేంద్రంలోని స్వీట్ హౌస్ లు, మిర్చి బజ్జీలు, టిఫిన్ సెంటర్లు, టీ కోట్లు, కిరాణా దుకాణాలు, మాంసం దుకాణాలు, బేకరీలు సంఖ్య ఏటేటా పెరుగుతున్నాయి.దుకాణాదారులు ఫుడ్ సేఫ్టీ యాక్టు 2006 ప్రకారం లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులు కేసులు నమోదు చేయాలి. పౌరులు, విద్యార్థులు, మహిళలు, సురక్షిత ఆహారం పై ఆహార భద్రత అధికారులు అవగాహన కల్పించాలి. వస్తువుల కొనుగోలుదారులు ప్యాకింగ్ పై తేదీ, నెల, సంవత్సరం, ఎమ్మార్పీ ధర పరిశీలించిన అనంతరం కొనుగోలు చేయాలి. మాచునూర్, కుప్పానగర్, బర్దిపూర్, ఎల్గోయి, కప్పాడు, ఝరాసంగం తదితర గ్రామాల్లో స్వీట్ హౌస్ లు, హోల్ సేల్ దుకాణాలు, బేకరీలు ఉన్నాయి.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక భక్తులు ప్రత్యేక పర్వదినాలలో భారీ సంఖ్యలో హాజరై ప్రసాదాలు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ మహాశివరాత్రి వేడుకల సన్నాహక సమావేశానికి మాత్రమే హాజరవుతారు. సంవత్సరానికి ఒక్కసారి సంతకం చేయడానికి మాత్రమే వస్తాడు. దీంతో వ్యాపారస్తులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యాపారం కొనసాగుతుంది.ఇదిలా ఉంటే.. ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగే హాస్టల్లు, మధ్యాహ్న భోజనం తనిఖీ చేయాల్సిన అధికారులు ఇప్పటివరకు ఒక్కసారి కూడా తనకు చేయలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దుకాణదారులకు లైసెన్లు, ఆహార భద్రతపై అవగాహన సదస్సులు, తరచుగా తనిఖీలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మండల ప్రజలు, కొనుగోలుదారులు, విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
