`కేంద్రం కొత్త మార్గదర్శకత్వం ఎవరి కోసం?
`ముందు చూపు లేని నిర్ణయం?
`అత్యవసరాలకు అప్పులు దొరక్కపోతే ప్రజలను ఆదుకునేవారెవరు?
`ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే అప్పులు నమ్మకాల మీద…
`ఫైనాన్స్ కంపెనీలు ఇచ్చే అప్పులు ఆస్తుల మీద…
`ఒకవేళ కేంద్రం అలాంటి మార్గదర్శకాలు తెస్తే సామాన్యుడు చితికిపోవడం ఖాయం.
`బిజేపి మీద వ్యతిరేకత పెరగడం తధ్యం.
`ధరల మోతలను ఇప్పటికీ భరిస్తూనే వున్నారు.
`అన్ని రకాల పన్నులను చెల్లిస్తూనే వున్నారు.
`ప్రశ్నించలేని సమాజంలో బతుకుతున్నారు.
`బతకలేక, చావలేక చస్తూ బతుకుతున్నారు.
`వెసులుబాటు లేని అర్థిక పరిస్థితులలో ఒదిగిపోతున్నారు.
`ప్రైవేటు వ్యక్తులు ఫైనాన్స్ వ్యాపారం నేరమే.
`ప్రభుత్వ రంగ సంస్థలు సామాన్యుడి అవసరాలను తీర్చగలదా?
`అత్యవసర పరిస్థితులనుంచి కాపాడగలదా?
`పెద్దలను కొట్టి పేదలకు పంచి అనే మాట విన్నాం.
`పేదల సొమ్ము పెద్దలకు పంచడం చూస్తున్నాం.
`ఒకప్పుడు పెద్దలు దేశాన్ని పోషిస్తున్నరని చెప్పుకునే వాళ్లు.
`ఇప్పుడు మధ్య తరగతి దేశానికి ఆదాయం ఇస్తోంది.
`ముక్కు పిండి వసూలు చేస్తున్నా మూలిగే శక్తి మధ్యతరగతికి లేదు.
`పన్నుల మీద పన్నులేస్తే సంపన్నులు దేశంలో వుండడం లేదు.
`ఇప్పుడు సాటి మనిషిని ఆదుకునే పరిస్థితి దూరమైతే మనిషే వుండడు.
హైదరాబాద్,నేటిధాత్రి:
అమ్మ పెట్టదు..అడుక్కుతిననివ్వదు..అని సామెత. అచ్చం కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక నిర్ణయమే చేయబోతోందని సమాచారం. ఊరు చెరువు ఎంత నిండినా పేద వాడి గుండె ఎప్పుడూ తడవదు. నిండదు. చెరువు నిండి పొలానికి నీరు పారినా పంట చేతికొచ్చేదాకా నమ్మకం వుండదు. పంట చేతికొచ్చే సమాయానికి చెరువు ఎండిపోవచ్చు. నీరు ఇంకిపోవచ్చు. పొలం మడి బీడులు వారొచ్చు. కరువు రావొచ్చు. పంటలుఎండపోవచ్చు. లేకుంటే అతి వృష్టి వచ్చి పంటంతానీట మునిగి మరిగిపోవచ్చు. చెడగొట్టు వానలు పడి పంట రాలిపోవచ్చు. ఇందులో ఏదైనా జరగొచ్చు. ఏది జరగకుండా, ఎంతో కొంత నష్టపోకుండా ఎప్పుడూ రైతు పూర్తిగా పంట చేతికొచ్చిన సందర్భాలు ఎప్పుడూ వుండవు. పేద వాడి కలలు కూడా అంతే. అవి తీరేదాకా కంటి మీద కునుకుండదు. ఎన్ని రోజులు ఎదరుచూసినా తీరుతాయన్న నమ్మకం కూడా వుండదు. కంటి తుడుపు చర్యలు తప్ప సామాన్యుడి కడుపు ఎప్పుడూ నిండా నిండిరది లేదు. మన దేశ ఆర్ధిక వ్యవస్ధ మొత్తం ఇందులో దాగి వుంది. మనది పూర్తిగా వ్యవసాయాధారిత ఆర్ధిక వ్యవస్ధ. మిశ్రమ ఆర్ధిక వ్యవస్ధ. ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎన్ని రకాల వ్యాపారాలు పెరిగినా కొనుగోలు శక్తి అంతా ఆ పల్లెల నుంచే రావాలి. సామాన్యుల చేతి నుంచే ఖర్చు కావాలి. దేశానికి ఆదాయం అందాలి. సాగును వదిలేసి ఏదైనా ఇతర కూలీ పని చేసుకుందామని పల్లె జనం అనుకుంటే పెట్టుబడి దారుడు ముగిపోయే కాలమొస్తే, మళ్లీ కూలి బతుకులు రోడ్డు మీదకు రావొచ్చు. మన దేశంలో బతులకే దిక్కులేదు. రోగమొస్తే వైద్యానికి సరైన సంపద లేదు. సాగుకే సక్కగ పెట్టుబడి లేదు. రోగమొస్తే లక్షలు ఖర్చు చేసుకునే దిక్కు లేదు. ఇలాంటి సమయంలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఆదుకునే ఏకైక మార్గం అప్పు. ఆ పదం పెద్దదైనా ఎంతోమంది జీవితాలను కూడా నిలబెట్టే మంత్రం. అందుకే పెద్దలు తప్పని స్దితిలో అప్పు చేసి పప్పు కూడా తినొచ్చని కూడా అన్నారు.
మన దేశంలో సుమారు 5లక్షలకు పైగా గ్రామాలున్నాయి. మన దేశమంతా గ్రామీణ ఆర్దిక వ్యవస్ధ మీదనే ఆదారపడి సాగుతోంది. ప్రతి గ్రామంలో మన దేశంలో ఒక వ్యక్తిమీద, మరో వ్యక్తి ఆధారపడకుండా రోజు గడవదు. పూట కూడా గడవదు. పల్లె జీవితంలో అంతంటి అన్యొన్యమైన అనుబంధాలు ముడివేసుకొని వుంటాయి. అందులో ఆర్దిక సంబంధాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అవే వారిని ముందుకు నడిపిస్తుంటాయి. పట్టణ వ్యవస్దలో ఇది ఇందుకు పూర్తి భిన్నంగా వుంటాయి. ఒకరికొకరికి ఎలాంటి మానవ సంబంధాలు పెద్దగా వుండవు. ఆర్ధికసంబంధాలు కూడా పెద్దగా కనిపించవు. బంధువుల మధ్య కూడా ఆ అనుబంధం పెద్దగా కనిపించదు. కాని పట్టణ వ్యవస్ధకన్నా, మన దేశంలో పల్లె వ్యవస్ధ పెద్దది. ఆర్ధికంగా బలమైంది. అందుకే పల్లెల్లో ఒకరి అవసరాలు మరొకరు తీర్చేంత నమ్మకాలు ఎక్కువగా వుంటాయి. అవసరానికి పల్లెలలో ఒకరు కాకపోయినా, ఎవరో ఒకరు ఆదుకునే వాళ్లు వుంటారు. ఒక వ్యక్తి కళ్ల ముందు చనిపోతుంటే చూస్తూ పోయేంత దౌర్భాగ్య పరిస్ధితులు కనిపించవు. సహజంగా ఆర్ధిక అవసరాలే, మనుషుల మధ్య బలమైన బంధాలను ఏర్పరుస్తుంటాయి. అవే కొన్నిసార్లు మనుషులను దూరం చేస్తాయి. శత్రువులుగా మారుస్ధాయి. కక్షలు, కార్పణ్యాలకు కారణమౌతాయి. అలాగని పల్లెలో ఒకరికొకరు సాయం చేసుకునే మనస్థత్వాలలో ఇప్పటికీ మార్పు రాలేదు. వారి జీవితాల్లో అగాదాలు సృష్టించబడలేదు. సహజం ఆర్ధిక అవసరాలు ఎదురైనప్పుడు అప్పులు తీసుకునేవాళ్లు పల్లెలో నూటికి ఎనభై మంది వుంటారు. వారిలో కొందరు అప్పులు తీర్చలేక కూడా అవస్దలు ఎదుర్కొంటుంటారు. కొందరు అత్యాశకు పోయి అప్పులు చేసి తిప్పలు పడుతుంటారు. ఇందులోనే అప్పులు చేసి తీర్చలేక ఎగ్గొట్టేవారుంటారు. అంటే అప్పులు ఇచ్చిన వారు కూడా కొన్ని సార్లు మోసపోయే సందర్భాలుంటాయి. అన్ని ఆర్ధిక సంబంధాలు సక్రమంగా వుంటాయని చెప్పలేం. అలాగని గ్రామీణ ప్రాంతాల ప్రజల తక్షణ అవసరాలను తీర్చేది సమీప బంధువులు. స్నేహితులు, సన్నిహితులు. వడ్డీ వ్యాపారులు. అందుకే పెద్దలు పల్లెల్లో ఓ మూడు ముఖ్యమైన వారుండాలని సూచించారు. ప్రతి పల్లెలో అప్పిచ్చువాడు వుండాలన్నారు. ప్రతి పల్లెలో వైద్యడు వుండాలన్నారు. ప్రతి ఊరు పక్కన ఏరు వుండాలని సూచించారు. ఈ మూడు సౌకర్యాలు వున్న ఊరులోనే నివాసం వుండాలని కూడా పూర్వీకులు చెప్పారు. ఎందుకంటే వడ్డీ వ్యాపారి అయినా సరే అవసరానికి డబ్బు సాయం చేసి ఆదుకునే వ్యక్తి ప్రతి ఊరిలోనూ వుంటే ఊరికే ఎ కష్టాలు వండవని అంటుంటారు. ఇప్పటికీ పల్లెల్లో అదే నమ్ముతారు. వారిపైనే ఆదారపడుతుంటారు. ఇక వైద్యుడు ఖచ్చితంగా వుండాలని అంటారు. అర్ధరాత్రో అపరాత్రో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదురైనా చేతిలో డబ్బులులేకపోయినా వైద్యం అందుతుంది. అప్పటికప్పుడు ఉపశనమం పొందేందుకైనా ఉపయోగపడుతుంది. అలాగే ప్రజలకు మంచినీరు, పంట పొలాలను సాగు నీరు అందే ఏరు వుండాలంటారు. ఇది వున్న ఏ ఊరు ఇబ్బందులకు గురి కాదు.
మరి ఇప్పుడు మన ప్రభుత్వాలు అప్పులు ఇచ్చే వారి మెడమీద కత్తిపెట్టే లాంటి నిర్ణయం చేయబోతోందన్న వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రజలనుంచి ప్రతి సందర్భంలోనూ తీసుకునే, చెల్లించే సొమ్ముల మీద కూడా పన్నులు వేలాడీస్తామంటే సరైంది కాదు. ప్రజలు ప్రతి అవసరానికి ఫైనాన్స్ కంపనీల మీద, ప్రభుత్వ బ్యాంకుల మీద ఆదారపడాలంటే సాద్యమౌతుందా? అందుకు బ్యాంకింగ్ వ్యవస్ధ ఒప్పుకుంటుందా? ప్రభుత్వాలకు రుణాలు ఇచ్చేందుకే నానా నిబంధనలు చూసుకొని ఇస్తాయి. ప్రైవేటు ఫైనాన్స్‌లు కూడా అంతే.. పైకి మాత్రం తక్కువ వడ్డీ అంటూ చెప్పినా, వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీలు, వాటిపై బారు వడ్డీలు వడ్డించకుండా వుంటాయా? అయినా ఈ సంస్ధలు సామాన్యుడి తక్షణ అవసరాలను తీర్చుతాయి. ఒక వ్యక్తికి తక్షణ అవసరాలకు బ్యాంకులు క్షణాల్లో రుణాలు ఇస్తాయా? కనీసం అప్పుకోసం వచ్చిన సామాన్యుడిని బ్యాంకు మేనేజర్ కలిసే అవకాశం వుంటుందా? ప్రైవేటు బ్యాంకులు కూడా ఎలాంటి తనఖా లేకుండా, ప్రభుత్త ఉద్యోగుల పూచీ సంతకాలు లేకుండా రుణాలిస్తాయా? పల్లెల్లోగాని, పట్టణాలలో గాని వ్యక్తిగత రుణాలు అందించే ప్రైవేటు వ్యక్తులు ఇచ్చినంత సులువుగా పైనాన్స్ కంపనీలు అత్యవసర వేళల్లో డబ్బు సమకూర్చుతుందా? ప్రైవేటు వడ్డీ వ్యాపారుల మూలంగా సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సంగతి వాస్తవమే. అలాంటి వ్యాపారులే క్షణాల మీద డబ్బులు పేదలకు ఇచ్చేది. వారికి అప్పుగా, నిర్ణీత వడ్డీకన్నా ఎక్కువ వసూలు చేసినా ప్రాణాల మీదకు వచ్చేంత సమస్యలున్నప్పుడు ఆదుకునేది ఆ వడ్డీ వ్యాపారులే. గ్రామాలలో ఆడ పిల్ల పెళ్లి చేసేందుకు కావాల్సిన డబ్బులు సాయంచేసేది వడ్డీ వ్యాపారులే. ఏదైనా అనారోగ్యంతో బాదపడుతున్నవారి వైద్య సాయం కోసం అప్పులిచ్చేది అలాంటి వాళ్లే. అయితే వారి అరచాలు పెరిగిపోతుంటే కట్టడి చేసేందుకు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు. అప్పులు తీసుకున్న వారిని వేధించడాన్ని అడ్డుకునేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కాని అప్పులే ఇవ్వకూడదన్నట్లు ప్రభుత్వాలు పాలసీ తీసుకొస్తే పల్లె జీవితాలు ఆగమౌతాయి.
మనది మిశ్రమ ఆర్ధిక వ్యవస్ద. ఏకీకృత ఆర్ధిక వ్యవస్ధ కాదు. మన దేశ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఎంతో కృషి చేశారు. అందుకోసం భవిష్యత్తు తరం కోసం ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా రచించారు. ఇప్పటి వరకు ఆయన సేవలను ప్రభుత్వాలు అనుసరిస్తూ వస్తున్నాయి. స్వాతంత్య్రానికి ముందే మన దేశంలో దేశ ఆర్ధిక వ్యవస్దను గాడిలోపెట్టేందుకు అవసరమైన అనేక ప్రణాళికలు చేపట్టడం జరిగింది. అందులో ఎంఎన్‌ఎన్ రాయ్ లాంటి వారుతెచ్చిన పీపుల్స్ ప్లాన్, శ్రీమన్నారాయణ తెచ్చిన సామ్యవాద ఆర్ధిక వ్యవస్దలో భాగమైన గాందీ ప్రణాళిక, 1943లో బొంబాయికి చెందిన ఎనమిది మంది పారిశ్రామిక వేత్తలు అందులో ముఖ్యమైన టాటా. బిర్లాలు కలిసి బాంబే ప్రణాళికలను రూపొందించారు. దాదాబాయ్ నౌరోజీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి వారు తెచ్చిన అనేక ప్రతిపాదనలన్నీ క్రోడీకరించి ప్రణాళికులు అమలు చేశారు. ఆర్ధిక వ్యవస్దను గాడిలో పెట్టారు. పైగా కాలానికనుగుణంగా ఇందిరాగాందీ, పివి. నర్సింహారావు, మన్మోహన్ సింగ్‌లు సంస్కరణలు కూడా తెచ్చారు. కాని గ్రామీణ ఆర్ధిక వ్యవస్దను ఎక్కడా చెడగొట్టే చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. కాని ఇప్పుడు గ్రామీణ ఆర్ధిక వ్యవస్దకు అండగా వుంటున్న వడ్డీ వ్యాపారులు అప్పులు ఇవ్వడంపై ఆంక్షలు విదిస్తే, సామాన్యులకు పల్లెల్లో రూపాయి అప్పు పుట్టదు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్ద అస్తవ్యస్తమయ్యే పరిస్దితులు ఎదురౌతాయి. కేంద్రం ఈ విషయంపై తీసుకురావానుకుంటున్న నిర్ణయం సరైంది కాకపోవచ్చు. మన దేశంలో ఎంత పట్టణ వ్యవస్ధ పెరిగినా పల్లె వాతావరణంలో మార్పు రాదు. తేలేము. వారి జీవితాలను చిద్రం చేసే నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దు. కాకపోతే ఇష్టానుసారం వడ్డీ వ్యాపారం చేయడాన్ని నియంత్రించాల్సిన అవసరం వుంది. ప్రామిసరీ నోట్ల మీద ఖచ్చితంగా వడ్డీ కూడా రాసేలా నిబంధనలు తీసుకురావాలి. సహజంగా ప్రామిసరీ నోటు మీద సంతకం తప్ప ఎలాంటి రాతలు లేకుండానే అప్పులు చేస్తుంటారు. వడ్డీలకు ఇచ్చే వారు కూడా నోటి మాట ద్వారానే వడ్డీని చెబుతుంటారు. ప్రభుత్వాలు నిర్ణయించిన మేరకు మాత్రమే అప్పులకు వడ్డీలు వసూలు చేసే వ్యవస్ధను నిర్మాణం చేయాలి. ప్రజలు కొంత ఉపశమనం కల్గించేలా నిర్ణయాలు చేయాలి.