బీసీల రిజర్వేషన్ తగ్గించినందుకు మీబాపు కేసీఆర్ మీద పోరాటం చెయ్ కవిత – వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

నాడు అధికారంలో ఉండగా ఎవరికి చెప్పా పెట్టకుండా స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ను ఇరవై మూడు శాతానికి తగ్గించి బీసీలను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఎమ్మెల్సీ కవిత పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావ్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో బీసీలకు అన్యాయం చేసినందుకు కెసిఆర్ ఫామ్ హౌస్ ముందు కవిత దీక్ష చేయాలని సూచించారు. శనివారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ లో వారి కుటుంబం మధ్య ఉన్న కాంపిటీషన్ ను తట్టుకునేందుకే ఎమ్మెల్సీ కవిత బీసీల రిజర్వేషన్ పేరిట కొత్త డ్రామాలు ప్రారంభించిందని మండిపడ్డారు. కడుపులో బీసీలపై కోపం పెట్టుకొని బయటకు పోరాటం చేస్తున్నానని ప్రగల్బాలు పలుకు తున్నదని ఆరోపించారు. బీసీలపై ప్రేమ ఉంటే గత పది ఏళ్ల కాలంలో వారి రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచాలని ఎందుకు ప్రశ్నించలేదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారం కోల్పోవడంతో మరో మాట మాట్లాడడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందన్నారు. పది ఏండ్ల కాలంలో బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో సరైన న్యాయం చేయలేదని, అన్ని ఎన్నికల్లోనూ వారిని మోసం చేశారని మండిపడ్డారు. బీసీలకు సరిగా టికెట్లు కేటాయించేందుకు నాడు కవిత ఎందుకు కృషి చేయలేకపోయిందని ప్రశ్నించారు. బీసీలను అన్ని రంగాల్లో అనగదొక్కింది బీఆర్ఎస్ పార్టీయేనని, కాంగ్రెస్ ప్రభుత్వంపై విషయం చిమ్మడం సరైంది కాదని హితవు పలికారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో నూటపంతోమ్మిది స్థానాలు ఉండగా, బీఆర్ఎస్ నుంచి కేవలం ఇరవై ఎనిమిది స్థానాల్లో బీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్లు అందించారని పేర్కొన్నారు. సరిగా వారికి టిక్కెట్లు కేటాయించగా తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులకు టికెట్లు ఇస్తే పద్నాలుగు మంది అభ్యర్థులు గెలిచారని తెలిపారు. అదేవిధంగా 2018 ఎన్నికల్లో ఇరవై నాలుగు మంది బీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తే పంతోమ్మిది మంది గెలిచారని పేర్కొన్నారు. 2023లో ఇరవై రెండు మంది బీసీ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఆర్ఎస్ నుంచి టికెట్లు కేటాయిస్తే తొమ్మిది మంది విజయం సాధించారని పేర్కొన్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో కేవలం రెండు స్థానాలు బీసీలకు కేటాయించారని, రెండు స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించారని పేర్కొన్నారు. 2019లో కేవలం ముగ్గురు బీసీ అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తే ఒక స్థానంలో విజయం సాధించారని చెప్పారు. గత సంవత్సరం 2024లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోతారను ముందే తెలుసుకొని ఆరుగురు అభ్యర్థులకు ఎంపీ టికెట్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఆరు స్థానాల్లో అభ్యర్థులంతా ఓడిపోయారని, బీసీ అభ్యర్థులను మోసం చేసిన చరిత్ర కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావుదని ఆరోపించారు. బిజెపితో పార్లమెంట్ ఎన్నికల్లో కుమ్మక్కై బీసీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోను బీసీలకు సరిగా టికెట్లు కేటాయించలేదని ఆరోపించారు. కెసిఆర్ కుటుంబంలోనే ఎప్పుడు పదవులు ఉండాలనే ఆలోచన ఉంటుందని, కానీ బీసీ బీఆర్ఎస్ నేతలను ఎంతో మందిని అనగదొక్కారని మండిపడ్డారు. నిజామాబాద్ లో బీసీ ఎంపీ అభ్యర్థి అరవింద్ చేతిలో ఓడిపోయిన కవితకు ఆరు నెలలోపే ఎమ్మెల్సీ ఉద్యోగం అందించిన ఘనత కెసిఆర్ దని పేర్కొన్నారు. అదే బీసీ నేతలకు అన్యాయం జరిగితే మాత్రం దగ్గరికి తీసిన దాఖలాలు లేని లేవని ధ్వజమెత్తారు. పదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన బీసీ నేతలకు నామమాత్రమైన మంత్రి పదవులు అందించి వారిని అవమానించారని రాజేందర్ రావ్ ఆరోపించారు. బీసీ నేతలకు మంత్రి పదవులు కేటాయించడంలోనూ వివక్షత చూపారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయంలో సీనియర్ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ ను అవమానకరంగా పార్టీ నుంచి బయటకు పంపించిన నీచ చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు. కవితకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని, కడుపులో కోపం పెట్టుకొని పైకి కత్తితో బీసీల సమస్యలపై పోరాటం చేస్తున్నానని కొత్త డ్రామాలు వేస్తున్నదని, ఎన్ని డ్రామాలు వేసిన ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోని సాధ్యమవుతుందని, స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లు కల్పించేందుకే కులగణన సర్వే చేపట్టిందని గుర్తు చేశారు. ఆకుల గణన సర్వేలో కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనకపోవడం దారుణమని మండిపడ్డారు. దీన్నిబట్టి చూస్తే బీసీ రిజర్వేషన్లకు వారు వ్యతిరేకమని అర్థమవుతున్నదని పేర్కొన్నారు. పైకి మాత్రం బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారని రాజేందర్ రావు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను యాబై శాతం కంటే ఎక్కువగా పెంచి తీరుతామని స్పష్టం చేశారని, అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమగ్ర కులగనన సర్వే చేపట్టిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు ప్రస్తుతం నమ్మే స్థితిలో లేరని రాజేందర్ రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!