ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: దైవ దర్శనానికి వెళ్తూ దుర్ఘటనకు గురైన కుటుంబంలో విషాదం నెలకొంది. జహీరాబాద్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయాలపాలయ్యారు. పస్తాపూర్ ఆనంద్నగర్ కాలనికి చెందిన దండు వెంకటేశం (45), ఆయన అక్క కొడుకు సాయికుమార్ (20) ప్రాణాలు కోల్పోయారు. జహీరాబాద్ నుంచి న్యాల్కల్ మండలంలోని ముంగి ఆశ్రమానికి బయలుదేరిన ఈ కుటుంబం రైల్వే గేట్ దాటిన కాసేపటికే దుర్ఘటన చోటుచేసుకుంది.
బీదర్ నుంచి జహీరాబాద్ వస్తున్న లారీ అజాగ్రత్తగా అతివేగంగా దూసుకొచ్చి, ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన బలానికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వెంకటేశం సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ సాయికుమార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గాయపడిన వారు వరలక్ష్మి అలియాస్ భవాని (వెంకటేశం భార్య), నాగేశ్వరరావు (బావ), పిల్లలు రిషికేశ్, హరిచందన, జాన్వీ వీరు అందరూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
సంఘటన సమాచారం అందుకున్న వెంటనే సీఐ శివలింగం, ఎస్ఐలు నవీన్ కుమార్, కాశీనాథ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో ఇరుక్కుని మృత్యువుతో పోరాడుతున్న సాయికుమార్ను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. అంబులెన్స్లో తరలిస్తుండగా అతను దుర్మరణం పాలయ్యాడు. ఇరుక్కున్న క్షతగాత్రులను తాళ్లు, ఇనుప రాడ్ల సహాయంతో బయటికి తీశారు. అనంతరం మృతదేహాలను పట్టణంలోని ఏరియా ఆసుపత్రి మార్చురికి తరలించారు.