యూరియా కోసం బారులు తీరిన రైతులు.
#పూర్తిగా కాలం కాకముందే కరువైన యూరియా.
#కృత్రిమ కొరతను సృష్టిస్తున్న డీలర్లు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
పూర్తిగా కాలం కాకముందే యూరియా బస్తాలు కరువైనాయని మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా బస్తాల కోసం రైతులు భారీ ఎత్తున బారులు తీరారు. ఆదివారం రోజున సహకార సంఘానికి 850 బస్తాల యూరియా దిగుమతి కాగా విషయము తెలుసుకున్న మండల రైతులు సోమవారం ఉదయాన్నే కార్యాలయం వద్దకు చేరుకొని యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు. బస్తాలు పంపిణీ చేసే సందర్భంగా ఒక్కసారిగా రైతులందరూ తోచుకుంటూ రావడంతో తొక్కిసలాట జరగగా దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా కార్యాలయ సిబ్బంది పంపిణీ కార్యక్రమం నిలిపివేశారు దీంతో రైతులు ఆగ్రహంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగగా.
సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే పోలీస్ సిబ్బంది సెంటర్ వద్దకు చేరుకొని రైతులను సముదాయించి యూరియా బస్తాల పంపిణీ సక్రమంగా జరిగే విధంగా చూశారు. ఇదిలా ఉంటే ఒకపక్క వ్యవసాయ అధికారులు మండల రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని చెబుతున్న కూడా అది ఆచరణలో ఎక్కడ లేకుండా పోయిందని పలువురు రైతులు బాహాటంగానే అంటున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులకు సరిపడా యూరియా బస్తాలు ఉండేవని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా బస్తాల కరువు మొదలైందని చిన్న తండకు చెందిన మహిళ రైతు అజ్మీర విజయ ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ప్రైవేటు డీలర్లు సైతం యూరియా బస్తాలు నిలువ ఉంచుకొని లింకుల పేరుతో రైతుకు అవసరం లేని మందులను కొంటేనే యూరియా బస్తా ఇవ్వడం జరుగుతుందని కరాకండిగా డీలర్లు చెబుతున్నారని మండల రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించి మండల రైతులకు ఖరీఫ్ సీజన్ కు సరిపడా యూరియా బస్తాలను సహకార సంఘాల , రైతు ఆగ్రోస్ ల ద్వారా పంపిణీ చేస్తేనే రైతుకు మేలు జరుగుతుందని రైతులు అన్నారు.