పక్కా ప్రాక్టికల్‌ పొలిటీషియన్‌!

`రాజకీయ ప్రయోగ శాలలో రేవంత్‌ రెడ్డి గెలిచి నిలిచాడు.

`కేసీఆర్‌ను కొడితే గాని ఆ స్థాయి నాయకుడిని కాలేననుకున్నాడు.

`న్యూటన్‌ ధర్డ్‌ లా పక్కగా ఫాలో అయ్యాడు.

`తెలంగాణకు అందుకే సిఎం అయ్యాడు.

`దటీజ్‌ రేవంత్‌ రెడ్డి అని నిరూపించుకున్నాడు.

`గెలవడం కోసం బంతిలా అనేక ఇబ్బందులు పడ్డాడు.

`పడిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో ఎదురొడ్డి నిలబడ్డాడు.

`ఇలాంటి రాజకీయ ప్రయత్నం అందరి వల్ల సాధ్యం కాదు.

`అలాంటి ప్రయోగాలకు ఎవరూ సిద్ధపడరు.

`కేసీఆర్‌ ను పదే పదే రెచ్చగొట్టాడు.

`కేసీఆర్‌ చేత అణిచివేతకు గురయ్యాడు.

`కేసీఆర్‌ను ఎదరించి నిలవడమే రాజకీయ గమ్యమనుకున్నాడు.

`కేసీఆర్‌ను గెలిచి రాజకీయ శూన్యత తెస్తేనే సీఎం అవుతా అనుకున్నాడు.

`తన లక్ష్యం కోసం గురిని కేసీఆర్‌పైకి ఎక్కిపెట్టాడు.

`కేసీఆర్‌ ను ప్రజల్లో దోషిగా నిలబెట్టాడు.

`అందుకోసం జైలును కూడా లెక్క చేయలేదు.

`కీలక సమయాలలో కూడా కుటుంబానికి దూరమయ్యాడు.

`ఎప్పటికైనా తన రోజు వస్తుందని బలంగా నమ్మాడు.

`తెలంగాణ ఉద్యమ, సాధన నాయకుడిని ఓడిరచాడు.

`తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ను దూరం చేసి ఎదురులేని నాయకుడయ్యాడు.

`నిజం చెప్పాలంటే రేవంత్‌ రెడ్డి అసలైన రాజకీయ ఏకలవ్యుడు.

`సీఎం కావడం కోసం కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమం ఎంచుకున్నాడు.

`రేవంత్‌ రెడ్డి సీఎం కావడం కోసం కేసీఆర్‌ తో తలపడి విజయం సాధించాడు.

`తెలంగాణ చరిత్ర లో కేసీఆర్‌తో సమాన రాజకీయ చరిత్ర లిఖించుకున్నాడు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

   తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌ రెడ్డి పక్కా ప్రాక్టికల్‌ పొలిటీషియన్‌ అని చెప్పడంలో సందేహమే లేదు. అలాంటి రాజకీయ నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు. అంతగా రాజకీయాలను ఆయన చాలెంజ్‌గా తీసుకున్నారు. అలా తీసుకొని విజయం సాధించారు. ఎంతో మంది యువ నాయకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. సహజంగా రాజకీయాలలో పదవుల కోసం నాయకులు ఎదురుచూస్తుంటారు. అవకాశాల కోసం పడిగాపులు పడుతుంటారు. పార్టీ పెద్దల ఆశీస్సులకోసం ఆరాపడుతుంటారు. రేవంత్‌ రెడ్డి రాజకీయం మొత్తం చూస్తే ఎక్కడా ఆయన పదవులకోసం ఎవరి ముందు నిలబడ్డది లేదు. ఎవరినీ మెప్పించాలని చూడలేదు. ప్రజలను నమ్ముకున్నాడు. ప్రజలతో కలిసి రాజకీయం చేశాడు. ప్రజలకు సేవ చేస్తూ గుర్తింపు పొందారు. పోరాటం చేస్తూ నిలబడ్డాడు. పోరాటమే జీవితం చేసుకున్నాడు. ఆయన పడిన రాజకీయ కష్టం అంతా ఇంతా కాదు. అందుకే అతి చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయంకూడా చెప్పొచ్చు. రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ దృష్టిలో తెలంగాణ వాది కాదు. అయినా ప్రజలు రేవంత్‌ రెడ్డిని నమ్మారు. అదే రాజకీయాల్లో అసలైన మ్యాజిక్‌ అని చెప్పకతప్పదు. తెలంగాణలో ఓ ఇరవై ఏళ్లపాటు రాజకీయ శూన్యత వుండదని బిఆర్‌ఎస్‌ అనుకున్నది. కేవలం పదేళ్ల కాలంలోనే కేసిఆర్‌ లాంటి నాయకుడి పాలన అంతమౌతుందని ఎవరూ ఊహించలేదు. కాని ఉమ్మడి రాష్ట్రంలోనే సిఎం. కావాలన్న ఆశతో, ఆలోచనలో అడుగులు వేసిన రేవంత్‌ రెడ్డి తెలంగాణకు రెండో సిఎం కావడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకోసం ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్‌ రెడ్డి న్యూటన్‌ ధర్డ్‌లాను పక్కగా ఫాలో అయ్యారు. రాజకీయాన్ని ఏకంగా తన ప్రయోగ శాలను చేసుకున్నాడు. ఎట్టిపరిస్ధితుల్లో కేసిఆర్‌ను కొడితే తప్ప తాను సిఎం. కాలేనని బలమైన సంకల్పం తీసుకున్నాడు. తన ఆశయానికి అనుగుణంగా తెలంగాణ వచ్చింది. తన ఆశల సాధనకు సిఎం. కావాలన్న మార్గ ఏర్పడిరది. ఇప్పుడు కాకపోతే ఇక మరెప్పుడూ కాలేమన్న నిర్ణయంతో రేవంత్‌రెడ్డి ముందుకెళ్లారు. తాను గెలవడం కోసం బంతిలా అనేక సార్లు ఒత్తిళ్లకు గురయ్యారు. అవి సామాన్యమైనవి కాదు. తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో ఆయన తెలుగుదేశం పార్టీలో వున్నారు. ఆ పార్టీ ఆలోచనలు అమలు చేయాలనుకున్నారు. అందులో రాజకీయంగా ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే రాజకీయపార్టీ నడుపుతున్నప్పుడు రాజకీయాలే చేస్తామని అనేకసార్లు కేసిఆర్‌ చెప్పిన సంగతి తెలిసిందే. కేసిఆర్‌ చేస్తే రాజకీయం, ఇతరులు చేస్తే అరాజకీయమెలా అవుతుంది. అందుకే కేసిఆర్‌ ప్రభుత్వం రేవంత్‌రెడ్డిని ఎదగకుండా చేయాలన్న ఆలోచనతో ఎంత ఒత్తిడికి ప్రయత్నం చేసినా, అంతే వేగంగా రేవంత్‌రెడ్డి నిలబడ్డాడు. అది కేసిఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఒక దశలో రేవంత్‌ రెడ్డి ఇంటి నుంచి బైటకు రాకుండా కట్టడి చేశారు. రోడ్లమీద ఎక్కడ పడితే అక్కడ అదుపులోకి తీసుకున్నారు. రేవంత్‌రెడ్డి ప్రజలకు దగ్గర కాకుండా చూసుకున్నారు. నిజం చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా రేవంత్‌ రెడ్డి ఎంత ఒత్తిడికి గురయ్యారో..పాలకపక్ష నేతగా కేసిఆర్‌ కూడా అంతకన్నా ఎక్కువ ఒత్తిడిని అనుభవించారు. అందుకే అడుగడుగునా రేవంత్‌రెడ్డిని అణిచివేయాలని చూశారు. కాని కుదరలేదు. జననేతగా రేవంత్‌ను ప్రజలు గుర్తించారు. గుండెల్లో పెట్టుకున్నారు. కేసిఆర్‌నుపక్కన పెట్టేశారు. పడిన ప్రతిసారి కేసిఆర్‌కు ఎదురొడ్డి నిలబడ్డాడు. పదే పదే జైలుకు పంపితే మానసికంగా రేవంత్‌ రెడ్డిని దెబ్బకొట్టాలని చూశాడు. చిన్న విషయాల మీద పదే పదే అరెస్టులు చేశారు. అయినా రేవంత్‌రెడ్డి బెనకలేదు. తొనకలేదు. దాంతో ఎలాగైనా రేవంత్‌ రెడ్డి కూతరు నిశ్చితార్ధ సమయంలో కూడా ఇబ్బందులకు గురి చేశారు. ఒకప్పుడు కేసిఆర్‌ను బలంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎదుర్కొంటున్నట్లు కనిపించారు. దాంతో ఆయనను ఒకసారి జైలుకు పంపించారు. జగ్గారెడ్డి ఆత్మస్ధైర్యం మీద దెబ్బకొట్టారు. అప్పటి నుంచి జగ్గారెడ్డి సైలెంట్‌ అయ్యారు. కేసిఆర్‌కు ఎంతో కొంత అనుకూలంగా మారాడు. సరిగ్గా ఇదే ఫార్ములా రేవంత్‌రెడ్డి మీద కూడా ప్రయోగించాలని చూశారు. కాని కుదరలేదు. ఇతర నాయకుల లాగా ఒత్తిడికి తలొగ్గి రేవంత్‌ రెడ్డి దారికి వస్తాడనుకున్నారు. కాని కేసిఆర్‌ ఆశలు ఫలించలేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి రాజకీయ ప్రయోగం మరే నాయకుడి వల్ల కాదు. అది కేవలం ఒక్క రేవంత్‌రెడ్డి వల్లనే సాద్యమైంది. పదే పదే జైలుకు పంపడాన్ని కూడా ఒకదశలో రేవంత్‌ రెడ్డి చాలా చిన్న విషయంగా మార్చుకున్నారు. దాంతో కేసిఆర్‌కు ఏం చేయాలో అర్దంకాని పరిస్ధితిని రేవంత్‌రెడ్డి సృష్టించారు. ఇదీ అసలైన రాజకీయమని చెప్పక తప్పదు. రాజకీయాల్లో ఒకప్పటి ప్రయోగాలు వేరు. ఇప్పుడున్న రాజకీయాల్లో ప్రయోగాలకు చాల వ్యత్యాసముంది. ఒకప్పుడు రాజకీయ ప్రయోగాలలో వ్యక్తిగత కక్షలు వుండేవికాదు. మొత్తం పార్టీ ప్రయోగాలు వుండేవి. కాని ఇప్పుడు నాయకుల టార్గెట్‌గా ప్రయోగాలు సాగుతున్నాయి. ఏ పార్టీలో నైనా ఒకరో ఇద్దరు నాయకులను టార్గెట్‌ చేస్తున్నారు. దాంతో మిగత నాయకులంతా సైలెంట్‌ అవుతున్నారు. కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో వున్నప్పుడు రేవంత్‌ రెడ్డి ఒక్కడు మాత్రమే పోరాట యోధుడిగా కనిపించారు. మిగతా నాయకులెవ్వరూ రేవంత్‌కు మద్దతుగా వెళ్లిన సందర్భాలు కూడా లేవు. అయినా ఒకే ఒక్కడుగా కేసిఆర్‌ను, బిఆర్‌ఎస్‌ మొత్తం పార్టీని ఎదుర్కొన్నాడు. అందుకే రేవంత్‌ రెడ్డి సిఎం.అయ్యారు. తాను సిఎం. కావడానికి ఒక రకంగా చెప్పాలంటే రేవంత్‌ ఆడిన రాజకీయం చాలా విచిత్రమైనది. పదే పదే కేసిఆర్‌ను ఆనాడు రేవంత్‌ రెచ్చగొట్టేవారు. తనను అణివేయాలన్న ఆలోచన కేసిఆర్‌కు వచ్చేలా చేసేవారు. కేసిఆర్‌ చేత రేవంత్‌ రెడ్డి ఇబ్బందులు పడుతున్నాడు. అణివేయబడుతున్నాడని ప్రజల్లో సానుభూతి పెరిగేలా చేసుకున్నాడు. ఈ విషయంలో రేవంత్‌రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌ అయ్యింది. ఎందుకంటే కేసిఆర్‌ను ఎదిరించి నిలవడమే రాజకీయ గమ్యమనుకున్నాడు. ఇలా ఏ నాయకుడు నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌ గాలి వస్తే గెలుస్తాం. లేకుంటే ప్రతిపక్షంలో కూర్చుందామన్న ఆలోచనలు చేసిన వారే అందరూ. కాని పార్టీని అధికారంలోకి తీసుకొస్తే తాను ముఖ్యమంత్రిని అవుతానన్న సంకల్పంత రేవంత్‌ రెడ్డి రాజకీయంచేశారు. అక్కడ కూడా కొన్ని సార్లు విఫలమయ్యారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయమేమిటంటే రేవంత్‌ రెడ్డి కేవలం కేసిఆర్‌ నుంచే కాదు సొంత పార్టీనుంచి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాళ్లల్లో కట్టెలు పెట్టే నాయకులు కాంగ్రెస్‌లో ఎక్కువ. అటు పార్టీలో అసమ్మతి వాదులను , ఇటు కేసిఆర్‌ను ఏక కాలంలో ఎదుర్కొంటూ నిలబడ్డాడు. కేసిఆర్‌ను గెలిచి రాజకీయ శూన్య తేవాలని చూస్తున్న సమయంలో సొంత పార్టీ కుట్రలను పెద్దగా పట్టించుకోలేదు. పార్టీలో పెద్ద నాయకులు చేసిన ఆరోపణలను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. ఎప్పుడైతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందన్న సంకేతాలు అందిన తర్వాత రేవంత్‌ రెడ్డి తన అసలైన రాజకీయం మొదలు పెట్టారు. తన లక్ష్యాన్ని పూర్తిగా కేసిఆర్‌ మీద ఎక్కుపెట్టారు. చెవిలో జోరిగాలాగా మారుతున్నకొంత మందినాయకులను పక్కన పెట్టేశారు. అటు కేసిఆర్‌ను ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు శతవిధాల కృషి చేశారు. రేవంత్‌రెడ్డి అదృష్టమో..కేసిఆర్‌ దురదృష్టమో గాని సరిగ్గా ఎన్నికలకు దగ్గర సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పగుళ్లు వచ్చాయి. ఇక రేవంత్‌రెడ్డి చెలరేగిపోయారు. కేసిఆర్‌ను ఓ ఆట ఆడుకున్నారు. కేసిఆర్‌ను ఆ క్షణం తెలంగాణుకు విలన్‌ అని చెప్పి నమ్మించడంలో సక్సెస్‌ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సాధకుడు అని చెప్పుకునే కేసిఆర్‌ను ప్రజలకు దూరం చేసి తెలంగాణ రాజకీయాల్లో ఎదురు లేని నాయకుడయ్యారు. రేవంత్‌రెడ్డి అసలైన ఏకలవ్య రాజకీయ నాయకుడు. తాను సిఎం కావడం కోసం కేసిఆర్‌ తెలంగాణను ఎంచుకున్నారు. రేవంత్‌ రెడ్డి సిఎం కావడం కోసం కేసిఆర్‌తో తలపడి గెలిచారు. తెలంగాణ చరిత్ర పాలనలో కేసిఆర్‌తో సమానమైన చరిత్ర రేవంత్‌ రెడ్డి లిఖించుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version