కొనుగోలు కేంద్రం లేక రైతులకు కోట్ల నష్టం

మద్దతు ధర కాగితాలపై మాత్రమే… రైతు కష్టం దళారుల దయపాల?”

రెండు కోట్ల లాభం చేతుల మధ్య జారిపోతుంది.. కొనుగోలు కేంద్రం కోసం రైతుల రాత్రి బతుకులు!”

“ధర ఉంది… కానీ కొనుగోలు కేంద్రం లేదు! – రైతు కష్టానికి దళారి ధరే మిగిలింది”

రామయంపేట ఏప్రిల్ 15 నేటి ధాత్రి (మెదక్)

రైతు చెమటతో పండిన పంటకు సరైన ధర రావాలని ఆశపడుతుంటే, వ్యవస్థలోని లోపాలు అతని ఆశలను చిద్రముచేస్తున్నాయి. నిజాంపేట మండలం బచ్చరాజ్‌పల్లి గ్రామంలో ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. సుమారు 1000 నుంచి 1100 ఎకరాల్లో రైతులు మక్కజొన్న పంటను సాగు చేసినా, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2400 ఉండగా, దళారులు మాత్రం కేవలం రూ.1800 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతులకు పెట్టుబడి కూడా తిరిగి రాక తీవ్ర నిరాశ అలుముకుంది.
గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్న రైతుల ఆకాంక్ష ఇంకా నెరవేరలేదు. గ్రామ సర్పంచ్ చిమ్మనమైన శైలజ శ్రీనివాస్ ఈ సమస్యను పరిష్కరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ సంబంధిత అధికారులతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ నిజాంపేట మండలానికి కేటాయించాల్సిన కొనుగోలు కేంద్రాన్ని తక్కువ దిగుబడి ఉన్న రామాయంపేటకు మళ్లించడం రైతుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.
బచ్చరాజ్‌పల్లి నుంచి రామాయంపేటకు పంట తరలించడం రైతులకు భారంగా మారింది. రవాణా ఖర్చులు, సమయపాలన సమస్యలు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటివరకు అక్కడ కూడా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో రైతులు రాత్రిళ్లు కొనుగోలు కేంద్రాల వద్దే నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది.
ఈ గ్రామంలో ఎకరాకు సుమారు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. మొత్తం ఉత్పత్తి సుమారు 33 వేల క్వింటాళ్లకు చేరుతోంది. ప్రభుత్వం ద్వారా కొనుగోలు జరిగితే క్వింటాల్‌కు రూ.600 లాభం రైతులకు అందే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద సుమారు రూ.1.98 కోట్ల లాభం ఒక గ్రామానికే దక్కే అవకాశం ఉంది. కానీ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో ఈ లాభం దళారుల చేతుల్లోకి వెళ్లిపోతోంది.
“ఇప్పటికైనా నిజాంపేటలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి” అని సర్పంచ్ శైలజ శ్రీనివాస్ అధికారులను కోరుతున్నారు. రైతుల ఆవేదనకు స్పందించి వెంటనే చర్యలు తీసుకోకపోతే, వ్యవసాయం మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతు కష్టానికి న్యాయం ఎప్పుడు? అన్న ప్రశ్నకు సమాధానం కోసం నిజాంపేట రైతులు ఎదురుచూస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version