రైతుల వరి ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడిని అరికట్టాలి

కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు

జాప్యాని నివారించి త్వరితగతిన కొనుగోలు చేపట్టాలి

ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎంసిపిఐ(యు), ఏఐకేఎఫ్ ప్రతినిధి బృందం

నర్సంపేట,నేటిధాత్రి :

రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించి మిల్లర్ల దోపిడిని అరికట్టి సకాలంలో రైతులకు బోనసుతో కలిపి డబ్బులను అకౌంట్లో జమ చేయాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.
సోమవారం ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులు కొనుగోలు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి అనేక ఒడుదుడుకులను తట్టుకొని వరి ధాన్యాన్ని పండిస్తే మార్కెట్ సౌకర్యం సరిగా లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అయినా సరైన మద్దతు ధర బోనస్ లభిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని కానీ కొనుగోలు కేంద్రాల్లో సరైన కనీస ఏర్పాటు లేకపోవడం వల్ల మిల్లర్ల చేతిలో బందీలైతున్నారని కుంటి సాకులతో బస్తాకు రెండు కేజీల నుంచి 5 కేజీల వరకు కోత విధిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తూ దోచుకుంటున్నారని అదేమని రైతులు ప్రశ్నిస్తే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యంలో మాకు బియ్యం రావడంలేదని చెబుతున్నారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ప్యాడి క్లీనర్లు, పరదాలు, తేమ యంత్రాలు అందుబాటులో లేవన్నారు. రోజుల తరబడి కొనుగోలు సెంటర్లలో, రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టి కుప్పచేసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారని ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కొరబడిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పోసిన ధాన్యంలో 10% కూడా కాంటాలు కాని వైనం నెలకొన్నదని జిల్లాలోని అన్ని పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు సెంటర్లలో ఇదే తంతు కొనసాగుతోందన్నారు.
ధాన్యం కాంటాలు అయినా లారీల కోసం రైతులు వేచి చూడాల్సిన దుస్థితి దాపురించిందని
వాతావరణ మార్పు, వర్ష సూచనతో రైతుల్లో పెరుగుతున్న ఆందోళన చెందుతున్నారని
త్వరిత గతిన ధాన్యం కాంటాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కలకొట్ల యాదగిరి, సంఘ నాయకులు గొర్రె సామ్యేల్, వీరన్న, నరేష్ ,మల్లయ్య ,వివేక్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!