# 14 కేసులు,9 మందిని అరెస్టు,175 లీటర్ల నాటు సారా 30 చెక్కెర, స్వాధీనం 5900 లీటర్ల చెక్కెర పానకాన్ని ధ్వంసం.
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పలు గుడుంబా సావరాలపై దాడులు నిర్వహించారు.ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి ఆదేశాల మేరకు అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు ఆధ్వర్యంలో నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ మండలం నాజీ తండా, బొటిమీది తండాతో పాటు గూడూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని గూడూరు మండలం లోని లక్మన్ తండా గ్రామాల్లో వరంగల్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ వరంగల్, నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్, గూడూరు ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది కలసి జాయింట్ దాడులు నిర్వహించారు.
ఈ దాడులలో 14 కేసులు నమోదు చేసి, 9 మందిని అరెస్టు చేయడం జరిగిందని అలాగే 175 లీటర్ల నాటు సారా మరియు 30 కిలోల చెక్కెర స్వాధీనం చేసుకొని, 5900 లీటర్ల చెక్కెర పానకాన్ని ధ్వంసం చేసినట్లు నర్సంపేట ఎక్సైజ్ శాఖ సిఐ నరేష్ రెడ్డి తెలిపారు.ఈ దాడులలో అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావు, ఎన్ఫోర్స్మెంట్ సీఐ నాగేశ్వర్ రావు, టాస్క్ ఫోర్స్ సీఐ రమేష్ చందర్, గూడూరు సీఐ భిక్షపతి, నర్సంపేట సిఐ నరేష్ రెడ్డి, ఎస్సైలు శార్వాణి, రాజేశ్వరి, శిరీష మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ నరేష్ రెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నుండి ఇప్పటి వరకు నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించి 102 కేసులు నమోదు చేసి 70 మంది వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది, 711 లీటర్ల నాటు సారా, 1450 కిలోల బెల్లం, 205 కిలోల పటిక మరియు 9 వాహనాలను స్వాధీనం చేసుకొని, 33550 లీటర్ల బెల్లం/ చెక్కెర పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్ట్ దుకాణాలపై దాడులు నిర్వహించి 20 మంది వ్యకులపై కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 59 మంది పాత నేరస్తులను, అనుమానితులను తహసీల్దార్ ల ఎదుట బైండోవర్ చేయడం జరిగింది మరియు బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన ఒక వ్యక్తికి 50,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని సీఐ నరేష్ రెడ్డి హెచ్చరించారు.