లక్ష్మారెడ్డికి కొండంత అండగా నిలిచిన శ్వేతారెడ్డి..
శ్వేతారెడ్డి మృతి పట్ల శోక సంద్రంలో పార్టీ కార్యకర్తలు..
మంగళవారం రోజు స్వగ్రామం ఆవంచలో అంత్యక్రియలు..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
జడ్చర్ల మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డికి సతీవియోగం కలిగింది.
గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డికి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు తెలిసింది.
అనారోగ్యం నుండి కోలుకుంటుందన్న తరుణంలోనే మృత్యువు వెంటాడింది. సోమవారం రాత్రి 10:30 గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్టు తెలిసింది.
డాక్టర్ లక్ష్మారెడ్డికి కొండంత అండగా ఉన్న శ్వేతారెడ్డి అనారోగ్యానికి గురి కావడంతో… ఆమె ఆరోగ్య విషయంలో లక్ష్మారెడ్డి తీసుకున్న శ్రద్ధ అంతా ఇంతా కాదు..
చెన్నైలోని ఓ ప్రధాన ఆసుపత్రిలో విదేశీ వైద్యులచే చికిత్స చేయించారు. ఆపరేషన్ విజయవంతం అయిందని.. ఇక కోలుకుంటుందన్న సమయంలోనే ఆమెను మృత్యువు వెంటాడింది..
ఆమె మరణ వార్త తెలియగానే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి.. ఆమె కుటుంబ సభ్యులు.. పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.
పార్టీ నాయకులు.. కార్యకర్తలను సైతం గౌరవిస్తూ.. ఎప్పుడు ఇంటికి వెళ్లినా.. జడ్చర్ల కు వచ్చినా వారితో మంచి మనసుతో మెలుగుతూ.. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్వేతారెడ్డి మరణం తమను కలచి వేస్తోందని.. పార్టీ ముఖ్య నాయకులు.. కార్యకర్తలు భావోద్వేగంతో వెల్లడించారు.
మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి ఆమె భౌతిక కాయం చేరుకుంటుంది.. అక్కడినుండి నేరుగా స్వగ్రామమైన తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చేరుకుని అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అంత్యక్రియలు కొనసాగించారు..
ఆమె పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని మనసారా వేడుకుంటున్నట్టు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.