Mega Lok Adalat to Resolve Disputes Peacefully in Mancherial
లోక్ అదాలత్ ద్వారా సామరస్యంతో సమస్యల ముగింపు
రాజీ మార్గంలో వివాదాల పరిష్కారం
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల,నేటి ధాత్రి:
లోక్ అదాలత్ ద్వారా సామరస్యంతో సమస్యలు ముగించుకోవాలని మార్చి 28న శనివారం నిర్వహించబడనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ ద్వారా వివాదాలు శాంతియుతంగా,రాజీ మార్గంలో పరిష్కారమవుతాయని తెలిపారు.రాజీకి అనువైన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,సివిల్ తగాదా కేసులు,ఆస్తి విభజన, కుటుంబపరమైన,వైవాహిక కేసులు,బ్యాంకు బకాయిల వసూలు,విద్యుత్ చౌర్యం,చెక్ బౌన్స్ వంటి కేసుల్లో ఇరువర్గాలు లోక్ అదాలత్ ద్వారా చర్చించుకుని రాజీకి రావాలని అన్నారు.
రాజీయే రాజమార్గం
చిన్న చిన్న తగాదాల కారణంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం,డబ్బు వృథా చేసుకోవద్దని తెలిపారు.జుడీషియల్ శాఖ అందించిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇరుపక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు.పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని అన్ని పోలీస్ అధికారులు,కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు,పోలీస్ సిబ్బందికి సరైన మార్గదర్శకాలు ఇచ్చి,రాజీ పడదగిన కేసులను గుర్తించాలని అన్నారు.ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ సాధించే ప్రయత్నాలు చేయాలని కమిషనర్ సూచించారు.తమ కేసుల్లో రాజీ కావాలని కోరుకునే వ్యక్తులు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు.లోక్ అదాలత్ ద్వారా వివాదాలు త్వరితగతిన పరిష్కారమై బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు.
లోక్ అదాలత్ గురించి ప్రజలకు సూచనలు:
ఇరుపక్షాల సమ్మతితో మాత్రమే రాజీ సాధ్యం.లోక్ అదాలత్లో జరిగిన రాజీ చట్టపరంగా తుది తీర్పుగా పరిగణించబడుతుంది.ప్రతి కేసులో న్యాయమూర్తులు, న్యాయవాదులు,సామాజిక కార్యకర్తల సమన్వయంతో పరిష్కారం జరుగుతుంది.ప్రజలు, పోలీసులు,న్యాయస్థానాలు కలిసికట్టుగా పనిచేస్తే చిన్న వివాదాలు కూడా పెద్ద సమస్యలుగా మారకుండా ముందే పరిష్కరించుకోవచ్చని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు.
