
Dubai Kingpin Behind ₹2500 Cr Drug Racket
దుబాయ్లో రూ.2500 కోట్ల డ్రగ్స్ రాకెట్ సూత్రధారి.. హై ప్రొఫైల్ లింకులు బహిర్గతం..
దేశంలో అతిపెద్ద డ్రగ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న పవన్ ఠాకూర్ దుబాయ్ కేంద్రగా డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తులో నిర్ధారణ అయింది.
దేశవ్యాప్తంగా భారీ డ్రగ్ నెట్వర్క్ నిర్వహిస్తున్న ముఠా లింకులకు సంబంధించిన కీలక వివరాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) దర్యాప్తులో గుర్తించింది. దుబాయ్ కేంద్రంగా డ్రగ్స్ దందా సాగిస్తున్న పవన్ ఠాకూర్ అనే వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు ఖరీదైన కార్లు, విల్లాలు కలిగి ఉన్నాడని.. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని ఎన్సిబి దర్యాప్తులో తేలింది. ఈ మేరకు అతడిపై ఇంటర్నేషనల్ సిల్వర్ నోటీస్ కూడా జారీ చేసినట్లు సమాచారం.
2024 నవంబర్లో ఢిల్లీలో దాదాపు రూ.2,500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడింది. ఏకంగా 82 కిలోల హై-గ్రేడ్ కొకైన్ స్మగ్లింగ్ చేస్తూ నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. దేశంలోనే ఈ స్థాయిలో మాదకద్రవ్యాల పట్టివేత జరగడం ఇదే తొలిసారి. ఈ కేసులో పవన్ ఠాకూర్ అనే నిందితుడు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) తెలిపిన వివరాల ప్రకారం, సరకును ట్రక్కులో దేశ రాజధానికి తరలించిన తర్వాత పంపిణీ కోసం గిడ్డంగిలో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పవన్ ఠాకూర్ దుబాయ్ కేంద్రంగా డ్రగ్స్ దందాను నడిపిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో నిందితుడ్ని పట్టుకునేందుకు ఎన్సిబి అధికారులు ఇంటర్నేషనల్ సిల్వర్ నోటీస్ జారీ చేశారు.