
8 గంటల కన్నా ఎక్కువగా కూర్చొని పనిచేస్తున్నారా? జాగ్రత్త..
చాలా మంది ఆఫీసులో గంటల తరబడి కుర్చీలపై కూర్చుని స్క్రీన్‌ను చూస్తూ ఉంటారు. అయితే, ఇలా ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల మన ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నేటి డిజిటల్ ప్రపంచంలో చాలా మంది ఉద్యోగులు రోజంతా కూర్చొని పనిచేస్తున్నారు. అయితే, అదే పనిగా ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తే ప్రాణాలకే పెను ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు కూడా రోజంతా కూర్చుని పనిచేసే వారే అయితే మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. లేదంటే అనేక వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అయితే, 8 గంటల కన్నా ఎక్కువగా కూర్చొని పనిచేస్తే ఏ వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండె జబ్బులు
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. అదే పనిగా కూర్చోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కేలరీలు బర్న్ కావు. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. ఊబకాయం క్రమంగా మధుమేహం, గుండె జబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును పెంచుతుంది. వెన్నునొప్పి, కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది దీర్ఘకాలిక నొప్పికి దారితీస్తుంది.
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ పెరుగుతుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎండార్ఫిన్ హార్మోన్ల స్రావం తగ్గుతుంది. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. దీనితో పాటు, నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. అలసట, చిరాకును పెంచుతుంది.
ఈ ప్రమాదం ఎందుకు పెరుగుతోంది?
కంప్యూటర్లు, మొబైల్స్, టీవీ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల శారీరక కార్యకలాపాలు తగ్గాయి. వర్షాకాలం వంటి సీజన్లలో బయటకు వెళ్లడం మరింత తగ్గుతుంది. పిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. అయితే, ఈ జీవనశైలి క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మానసిక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.
ఏం చేయాలి?
ప్రతి 30-40 నిమిషాలకు లేచి 2-3 నిమిషాలు నడవండి. ప్రతిరోజూ 30 నిమిషాలు వాకింగ్ చేయండి. మీ వెన్నెముకకు మద్దతు ఇచ్చే కుర్చీలో నిటారుగా కూర్చోండి. తగినంత నీరు తాగండి. ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోండి. ఈ చిన్న మార్పులు మీరు ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి సహాయపడతాయి.