Focus on Maternal & Child Health
మాత శిశు సంరక్షణకు కృషి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేయడం ద్వారా మాత శిశు సంరక్షణకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్లా రమ్య,ఆర్.ఎం.ఓ. శ్రీధర్ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుందని తెలిపారు.శుద్ధమైన త్రాగునీరు, నాణ్యమైన పోషక ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని, వ్యాధులకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.గర్భిణీల వివరాలు నమోదు చేసి సమయానుసారంగా చేసుకోవలసిన వైద్య పరీక్షలు, తీసుకోవలసిన ఆహారం, పాటించవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంపొందించడం జరిగిందని తెలిపారు.ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో ఆరోగ్య ఉప కేంద్రాలు,ప్రాథమిక ఆసుపత్రులు,సామాజిక ఆసుపత్రులు,ప్రభుత్వ ఆసుపత్రులు,పల్లె,పట్టణ దవాఖానాలు,ప్రభుత్వ వైద్య, నర్సింగ్ కళాశాలల ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ప్రస్తుతం మాతా శిశు ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో వరద నీటి ఇబ్బంది ఉన్నందున త్వరలో పూర్తి కానున్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని,ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చేందుకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు.లక్షెట్టిపేట సామాజిక ఆసుపత్రి, బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని,జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, చెన్నూర్ మండల కేంద్రంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి,పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.గ్రామ,మండల,జిల్లా స్థాయిలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు.ఆశ, ఆరోగ్య కార్యకర్తల నుండి వైద్యుల వరకు గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని,వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం స్టాఫ్ నర్సులు,సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలతో మర్యాదగా నడుచుకోవాలని,స్నేహపూర్వక వాతావరణం లో వైద్య చికిత్స అందించాలని తెలిపారు.అనంతరం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రభుత్వం ప్రజల సంక్షేమం,అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు 129.25 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి, 23.75 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
