ప్రతి ఇంటిని సర్వేలో కవరు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు

భూపాలపల్లి నేటిధాత్రి

బుధవారం టేకుమట్ల మండలం, టేకుమట్ల గ్రామంలో మిషన్ భగీరధ ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే సిబ్బందితో కుటుంబాన్ని స్వయంగా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు..? మీ ఇంటికి నల్లా కనెక్షన్ ఉందా..? మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా.. ఎన్ని
రోజులకోసారి వస్తున్నాయి… శుద్ధమైన నీరు అందుతుందా..? అంటూ కుటుంబాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలకు సరిపడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు అందించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 241 గ్రామ పంచాయతీలలో ఈ సర్వే జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో సోమవారం ప్రారంభమైన ఈ సర్వే పూర్తిస్థాయిలో కొనసాగుతోందని అన్నారు. పది రోజుల్లోగా ఈ సర్వేను పూర్తిచేయనున్నట్లు ఆయన తెలిపారు. సర్వే బృందాలు పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని, ఇందు కోసం ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో ప్రత్యేక యాప్ కూడా సిద్ధం చేసిందని అన్నారు. సర్వే పూర్తి వివరాలను యాప్ లో పొందుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సర్వేలో
ఇంటి యజమాని పేరు, మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఉందా? నీటి సరఫరా సక్రమంగా జరుగుతోందా? కుటుంబం మొత్తానికి నీళ్లు సరిపోతున్నాయా అనే వివరాలు సేకరిస్తున్నారని అన్నారు. సర్వే పూర్తి అయిన తరువాత ఆ గ్రామంలో ఎంత మంది చనిపోయారు, వలస వెళ్లిన వారి వివరాల నివేదిక అందచేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *