డిఐఈవో కార్యాలయంలో…దొంగలు…?
వరంగల్ ఇంటర్మీడియట్ అర్బన్‌జిల్లా కార్యాలయంలో క్యాంపు డబ్బులకు కొంతమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు సైతం కన్నంవేసి మాయంచేసిన పరిస్థితి కార్యాలయంలో నెలకొన్నది. సుమారుగా 10లక్షలకు పైగా వీరంతా కలిసి మాయంచేసినట్లు సమాచారం. ‘నేటిధాత్రి’లో ”డిఐఈవో కార్యాలయంలో..అవినీతి లీలలు”, ”కాసులపై ప్రీతి…ఇదేం రీతి”, ”భుజాలు తడుముకుంటున్నారు”, ”ప్రైవేటు..రుబాబు”, ”అవినీతికి…సూత్రధారి..?”, ”కెమెరాలు బంద్..డిఐఈవో హస్తం ఉందా..?”, ”మాయమైన పైసలు..సాయిబాబా మహిమలు..”, ”అవినీతి లీలలపై ఉలుకులేదు..పలుకులేదు..” అనే శీర్షికలతో ప్రచురితమైన సంగతి పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన దొంగలు రిజిస్టర్లను, బిల్లులను, సంతకాలను మార్చే పనిలో ఉన్నారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
– ప్రైవేటు పైరవీదారుల చుట్టు ప్రదక్షణలు
మెక్కేసిన క్యాంపు డబ్బుల విషయంలో అవినీతికి పాల్పడిన కొంతమంది, ఒకవేళ విచారణ కమిటీని వేస్తే మేము ఖచ్చితంగా దొరికిపోతాము, మమ్ములను మీరే రక్షించాలంటూ ప్రైవేటు పైరవీదారుల చుట్టు తిరుగుతూ కాళ్లా..వేళ్లా పడుతు బ్రతిమలాడుకుంటున్నారని తెలుస్తోంది. ఏకంగా డిఐఈవోనే బ్లాక్‌మెయిల్ చేస్తూ అందరం దొరికిపోతాము. కాబట్టి మీరే మమ్ములను రక్షించాలంటూ వేడుకుంటున్నారట. డిఐఈవో మాత్రం విచారణ కమిటి వేసేది లేదు..వారు వచ్చేది లేదు…మనం దొరికేది లేదు..మీరు ధైర్యంగా ఉండండి అన్ని నేను చూసుకుంటాను అన్న ధీమాతో డిఐఈవో ఉన్నట్లు కార్యాలయంలో కొందరు గుసగుసలాడుకుంటున్నట్లు సమాచారం.
(ఎంత నొక్కేశారు..ఎలా నొక్కేశారు…వివరాలు త్వరలో)