
ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:
పొలాలనను నమ్మి హలాలు దున్నే రైతులు తమ బలాన్ని మాత్రమే కాదు… ప్రాణాలనూ పొలానికే అర్పిస్తున్నారు.
ఇది ఒక్క ఏడాది కథ కాదు..ఎన్నో ఏళ్లుగా సాగుతున్న వ్యథ..
ఏళ్లుగా సాగునీ కొనసాగిస్తూ.. దేశానికే అన్నం పెడుతున్న రైతుకి మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి …
ఒక రైతుకు వరి శిక్ష.. మరో రైతు నెత్తిన పత్తి కత్తి.. ఇంకో రైతుకు నిలువెల్లా కూర గాయాలు.. మరో రైతుకు భారంలా వేరుశనగ ..
ఘోరంగా ఉల్లి.. చేదుగా చెరుకు..
ఏ రైతును చూసిన కష్టమే .. సాగు నష్టమే..
అయితే కేవలం సాగు మాత్రమే కాదు ..సాగు చేసే భూమి కూడా వారి పాలిట మృత్యుపాశంగా మారుతుంది…
విత్తు దశ నుంచే చిత్తు చిత్తవుతున్న రైతన్న .. ఆ విత్తే భూమి తనదైన సరే ..హక్కులు సాధించాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ..ఈ పోరాటంలో తన భూమిపై తనకే హక్కుని కోల్పోతూ చివరికి తన ప్రాణాన్నే విడుస్తునాడు ..
తాజాగా రాష్ట్రంలో జరుగుతున్నా రైతన్నల ఆత్మహత్యలు చూస్తుంటే మనిషన్న వారికి ..మనసున్న వారికి కన్నీళ్లు రాక మానవు ..
ఏళ్లుగా తాను పండిస్తున్న .. తనకు అండగా నిలుస్తున్న భూమి తనదై కాదని అంటుంటే పాణం పోతుంది రైతన్నకు ..
హలం పట్టి పొలం దున్ని నాటు వేసే నాటి నుంచి పంట ఇంటికి వచ్చి అమ్మేవరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్న రైతుకి .భూ సమస్యలు మరింత భారంగా మారుతున్నాయి ..సకల భూ సమస్యలకు సర్వరోగ నివారిణిగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ సమస్యల కేంద్రంగా మారింది.
రైతన్నల సావులకి కారణం అవుతుంది.. భూముల తగాదాలతో కొందరు జైళ్ల పాలవుతుంటే కొందరు ఏకంగా ప్రాణాలే విడుస్తున్నారు..
ధరణి పోర్టల్ ఎంతోమంది రైతులకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికి.. కొంతమంది రైతుల పాలిట శాపంగా మారింది…22 లక్షల మంది రైతులు దీని బాధితులుగా ఉన్నారంటే పరిస్థితి ఏంటో అర్ధం అవుతుంది …
ధరణి లోపాలు .. శాపాలుగా మారి రైతుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి.. రైతులు తమ కన్నతల్లిలా భావించే భూమిని, తమ ప్రాణంగా ప్రేమించే భూమిని, తమకు తెలియకుండానే కోల్పోతున్నారు… ధరణి లో ఉన్న సాంకేతిక లోపం కారణంగా ఎందరో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .. ఒక వ్యక్తీ హక్కుదారుడిగా ఉన్న భూమి వేరే వ్యక్తికి పట్టా అవడం జరుగుతుంది…పట్టా పొందిన వ్యక్తులు స్వార్థానికి, అత్యాశకు పోయి, మంచితనం, నైతిక విలువలు మరచి, ఆ భూము తనదే అని కబ్జా కు పాల్పడి, పంచాయితీ పెడుతున్నారు..ఇలాంటి సందర్భం లో ” దుడ్డు ఉన్న వాడిదే బర్రె “
“పట్టా ఉన్నవాడిదే భూమి ” అన్నచందంగా వ్యవస్థ తయారైంది…
ఈ పంచాయితీ తేలక ..తమ పొలం తమకి దక్కుతుందో లేదో తెలియక ఎందరో రైతన్నలు బలవంతంగా ప్రాణాలు విడుస్తున్నారు…
పనే ప్రపంచంగా బ్రతికే,
ఒక సాధారణమైన రైతుకు, ఒక నిరుపేద రైతుకు, భూ సమస్య వస్తె
సంవత్సరాల తరబడి, పంచాయితీల చుట్టు, పోలీసుల చుట్టు, కోర్టుల చుట్టు తిరగగలడా…తిరిగిన న్యాయం జరుగుతుందా..
మరి ఇలాంటి పరిస్థితుల్లో వారికీ దిక్కేది..
ఇక మరణమే శరణ్యమా .. అండగా నిలబడే వ్యక్తులే లేరా అంటే సమాధానమే లేదు…
చొరవ తీసుకొని క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించే పెద్ద మనుషులు కొన్ని సందర్భాల్లో సమస్యను పరిష్కరించాల్సింది పోయి..
వారి స్వార్ధానికి సమస్యను సాగదీస్తూ, మరింత జటిలం చేస్తున్నారనడం లో ఆశ్చర్యం లేదు…
గత, ప్రస్తుత ప్రభుత్వాలు, ఎంతోమంది రైతుల ఆత్మహత్యలు జరిగిన, హత్యలు జరిగిన… చోద్యం చూస్తున్నారు తప్ప ధరణి వల్ల జరిగినా పొరపాట్లను ఇప్పటివరకు సవరించలేదు…
బాధిత రైతులకు జరిగినా నష్టన్ని కేత్ర స్థాయి లో పరిశీలించి, పరిష్కరించే, ప్రయత్నం చేయడం లేదు..
అందరూ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఒక రైతు ఆత్మహత్య అతని వ్యక్తిగతమైనది కాదు..అది ఒక సామజిక నేరంగా పరిగణించాలి.. ఒక రైతన్న చావు అతని కుటుంబానికే కాదు..
దేశానికే తీరని నష్టమని గుర్తించాలి..
రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం ఉండాలి..
ధరణి సమస్యలు పరిష్కరించే అధికారం గతంలో కేవలం కలెక్టర్లకు మాత్రమే ఉండేది. అక్కడి వరకు పోలేక ..సమస్యలు పరిష్కరించలేక రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు..
వేల సంఖ్యలో అఫ్లికేషన్లు వచ్చిన నేపథ్యంలో పరిష్కారంలో తీవ్ర జాప్యం జరిగి ..భూమి మనకు దక్కదేమో అనే భయంతో రైతన్న బెంబేలెత్తిపోతున్నాడు . అయితే ఇటీవల ఆర్డీవోలు, తహసీల్దార్లకు కూడా లాగిన్ సౌకర్యం కల్పించారు. అయినా ఇంకా ఎన్నో సమస్యలు అలానే ఉన్నాయి .. ధరణి పోర్టల్అమల్లోకి వచ్చిన తర్వాత అనేక భూ సమస్యలు తెరపైకి వచ్చాయి.
ఖాతా, సర్వేనంబర్లు మిస్సింగ్, తప్పులు, పట్టాదారు పేర్లు, ఫొటోల్లో తప్పలు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, పట్టా, అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములుగా నమోదు ఇలా ఎన్నో రకాల తప్పులు దొర్లాయి..
ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయని ప్రస్తుత ప్రభుత్వం అంటుంది.. అవి చిన్నాభిన్నంగా కాకుండా , రైతున్నకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది ..లేకుంటే మరింత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది ..అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి .. ధరణి లోపాలని సవరించి ..ధరణిని నమ్ముకున్న రైతన్న ని బతికించి వారి భూమికి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి
సామజిక కార్యకర్త