DGP Launches Training for 115 DSPs in Hyderabad
డీఎస్పీలకు ట్రైనింగ్.. ప్రారంభించిన డీజీపీ
ఈ 10 నెలలు చాలా కష్టంగా ఉంటుందని.. అన్నింటినీ ఎదుర్కొని సమర్థవంతంగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలు గెలవగలగాలని నిర్దేశించారు.
హైదరాబాద్, నవంబర్ 6: గ్రూప్ 1లో ఎంపికైన 115 మంది డీఎస్పీలకు ట్రైనింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు (గురువారం) ఉదయం డీజీపీ శివధర్ రెడ్డి (Telangana DGP Shivadhar Reddy) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీజీపీఏకు చేరుకున్న డీజీపీకి టీజీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్త్ గౌరవ వందనంతో స్వాగతం పలికారు. రాజేంద్రనగర్‌లోని టీజీపీఏలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. 115 మందితో ఇదే అతిపెద్ద డీఎస్పీ బ్యాచ్ అని అన్నారు.
ఈ 10 నెలలు చాలా కష్టంగా ఉంటుందని.. అన్నింటినీ ఎదుర్కొని సమర్థవంతంగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలు గెలవగలగాలని నిర్దేశించారు. కొత్తగా రిక్రెట్ అయిన మహిళా డీఎస్పీలు వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ట్రైనింగ్‌లో స్నేహపూర్వకంగా ఉంటూ.. ఒకరికి ఒకరు తోడ్పాటు అందించుకోవాలని సూచించారు. ఇంటెగ్రిటీ, ఎంపథీ, ప్రొఫెషనల్ ఎక్స్‌లెన్స్.. ఈ మూడు ముఖ్యంగా గుర్తించుకోవాలని అన్నారు. ఈ వంద మంది ట్రైనింగ్‌లోనే కాదు.. బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా కాంటాక్ట్‌లో ఉండాలని తెలిపారు. పోలీసింగ్‌కు నెట్వర్క్ చాలా ముఖ్యమని ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
