అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని చెన్నూర్ మండలంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని,ఈ క్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.చెన్నూర్ పట్టణంలో చేపట్టిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలించారు.స్థానిక ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని,ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అమృత్ 2.0 పథకం కింద పట్టణంలో చేపట్టి కొనసాగుతున్న నీటి ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
