
రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట పట్టణంలోని వీధివీధిన వినాయకుడు కొలువు దీరినా మండపాలకు వెళుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రజల పై ఉండాలని మొక్కుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని వినాయక మండపాలను ఆయన బుధవారం సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ ఐకమత్యంతో, ఆనందంతో గణపతి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. గణనాథుడి ఆశీస్సులతో అనేక విఘ్నాలు అధిగమిస్తూ రాష్ట్రం సుభిక్షంగా ఉందని. అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు లంబోదరుడి ఆశీస్సులతో నిర్విఘ్నంగా కొనసాగి.. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఆనందంగా ఉండేలా దీవెనలు అందివ్వాలని విఘ్నేశ్వరుని ప్రార్థించినట్లు చెప్పారు. ప్రతి వినాయక మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు తన వంతు ఆర్థిక చేయూతగా 5 వేల రూపాయలు చొప్పున మండపాల నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు, బిఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.