దేశవ్యాప్తంగా మరోసారి భారతీయ జనతా పార్టీ సునామీ కొనసాగింది. 45రోజుల ఉత్కంఠ అనంతరం కొనసాగిన ఎన్నికల లెక్కింపులో దేశవ్యాప్తంగా మొదటి నుంచి బిజెపి తన సత్తా చాటింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఖాతా తెరిచిన బిజెపి ఎవరి మద్దతు లేకుండానే అధికారపీఠం ఎక్కడానికి మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకుంది. మిత్రపక్షాల సహకారం లేకుండానే 299 స్థానాలను సాధించుకుంది. మిత్రపక్షాలతో కలుపుకుంటే 348 స్థానాలతో బిజెపి బలమైన శక్తిగా అవతరించింది. యుపిఎ తన మిత్రపక్షాలతో కలిసి 90స్థానాలను సాధించగా కేవలం 50 స్థానాలను సొంతంగా సాధించగలిగింది.
రెండోసారి మోడీ హవా
దేశంలో రెండోసారి మోడీ హవా కొనసాగింది. నోట్ల రద్దు, జిఎస్టీ తదితర అంశాలు మోడీకి ఎన్నికల్లో ప్రతికూలంగా మారి ఘోరపరాజయాన్ని పొందుతాడని ప్రతిపక్షాలు కలలు కంటే వాటినన్నింటిని కల్లలుగా మార్చి, దేశప్రజలు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం దగ్గర నుండి బిజెపి తన ప్రభావాన్ని చూడగలిగింది. దీంతో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని పీఠం ఎక్కనున్నారు. బిజెపి విజయంతో పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం నెలకొంది.
కాంగ్రెస్ అంచనాలు తలకిందులు
ఈ ఎన్నికల్లో ఘనవిజయాన్ని సాధించి ప్రధాని పీఠం ఎక్కవచ్చనే రాహుల్‌గాంధీ ఆశలపై బిజెపి నీళ్లు చల్లింది. ఘనవిజయంతో రాహుల్ ఆశలు అడియాశలయ్యాయి. ఎంపీగా కేరళ వయనాడ్‌లో, యుపి అమేథీలో పోటీ చేసిన రాహుల్ కేవలం కేరళ వయనాడ్‌లో మాత్రమే తన ప్రభావాన్ని చూడగలిగాడు. అమేథీలో కేంద్రమంత్రి స్మృతిఇరానీతో తలపడిన రాహుల్ విజయం కోసం తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.
పశ్చిమబెంగాల్‌లోను బిజెపి హవా
పశ్చిమ బెంగాల్‌లో మొదటి నుండి దీదీ వర్సెస్ మోడీగా కొనసాగింది. అయితే ఇక్కడ బిజెపి అంతగా ప్రభావం చూపదని అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ బిజెపి 15స్థానాల్లో తన సత్తాను చాటుకుంది. తృణమూల్ 25స్థానాలతో సరిపెట్టుకుంది.