డెంగ్యూ నివారణ మా బాధ్యత సురక్షితమైన రేపటి కోసం

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

మంచిర్యాల నేటిదాత్రి

జిల్లాలో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, “డెంగ్యూ నివారణ మా బాధ్యత – సురక్షితమైన రేపటి కోసం” అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ అధికారి డా॥ అనిత, జిల్లా సర్వేయలెన్స్ అధికారి డా॥ ఫయాజ్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో కీటక జనిత వ్యాధులు, దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని, డెంగ్యూ లాంటి విషజ్వరాల వ్యాప్తిని నివారించేందుకు ప్రజలందరు తమ వంతు బాధ్యత నిర్వహించాలని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి తగిన చికిత్స తీసుకోవాలని తెలిపారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నివాస ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, మురుగు కాలువలలో నీరు నిల్వ ఉన్నట్లయితే ఆయిల్ బాల్స్ చల్లాలని, ఇంటి పరిసరాలలో ఎక్కడా చెత్త లేకుండా శుభ్రపర్చుకోవాలని, ప్రతి మంగళ, శుక్రవారాలలో డ్రైడే పాటించి దోమలను లార్వా దశలోనే నిర్మూలించేలా ప్రజలు సహకరించాలని తెలిపారు. ఆరోగ్య, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద మహిళా ఆరోగ్య కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి వ్యాధి లక్షణాలను పరిశీలించి, ఉన్నట్లయితే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించడం జరుగుతుందని, వసతిగృహాలు, పాఠశాలల్లో శుభ్రతపై వివరించడమే కాకుండా పాటించేలా పర్యవేక్షించాలని తెలిపారు. వ్యాధి నిర్ధారణ కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఏర్పాటు చేసిన కిట్ల ద్వారా ప్రాథమికంగా నిర్ధారించడం జరుగుతుందని, జిల్లా ఆసుపత్రిలో టి-హబ్లో నిర్ధారణ కొరకు పరీక్షలు చేయించుకోవాలని, ఎలాంటి భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదని, డెంగ్యూ నివారణ దిశగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నివాస ప్రాంతాలు, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు లహరి, ప్రశాంతి, ఎస్.యు.ఓ.లు, నాన్దేవ్, సత్యనారాయణ, రవీందర్, హెచ్.ఈ. అల్లాడి శ్రీనివాస్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!