ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు మంత్రి పదవి దక్కని ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తెలంగాణ రాష్ట్రంలో అది ముఖ్యమంత్రి కేసిఆర్ చొరవతో మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి దక్కిన నాటి నుంచి ఎర్రబెల్లి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో తానొక్కడినే మంత్రిని అని టిఆర్‌ఎస్ సీనియర్లు, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నాడని అంతర్గతంగా విమర్శలు ఎదుర్కొంటున్న ఎర్రబెల్లి తన బిల్డప్‌ను పెంచుకుని కాస్ట్లీ మంత్రి అనిపించుకోవడానికి తెగ ఆరాటపడిపోతున్నాడట. ఈ బిల్డప్‌లో భాగంగా ఎంతగా ఖర్చుపెట్టడానికైనా మంత్రి వెనుకాడడం లేదని బాగానే ప్రచారం జరుగుతోంది. నెలవారీగా మంత్రికి భారీగానే ఖర్చు అవుతున్న ఆ ఖర్చును అవలీలగా వేసి అవతల వేస్తున్నట్లు తెలుస్తోంది.
పీఎలకు లక్షల్లో ఖర్చు…?
పీఎలకు, పీఆర్వోలకు నెలవారిగా చెల్లించడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్న మంత్రి పీఎల నియామకం విషయంలో తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడట. తన చుట్టూ ఉండేందుకు డజను మందికిపైగా పీఎలను నియమించుకున్న ఎర్రబెల్లి ఎంతమంది తన వెనకాల ఉండే అంతమంచిది అనే లెవల్‌లో భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పీఎలు, పీఆర్వోలకు 20వేలకుపైగానే జీతం చెల్లిస్తున్న మంత్రి నెలవారీగా ఈ మొత్తం ఎక్కడి నుంచి, ఎలా సమకూరుస్తున్నారో అర్థం కాని విషయం. ప్రభుత్వం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను పీఎలు, ఓఎస్డీగా అందజేయగా నలుగురు అటెండర్లను సైతం సమకూర్చిందట. వీరు సరిపోరనట్లుగా మంత్రి తన ఇష్టారీతిన నియమించుకుంటున్నారు. మంత్రి చుట్టూ ఉండేందుకు ఎవరిని పలకరించిన మంత్రి పీఎను అని అంటున్నారట. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలు ఎవరు పీఎలో, ఎవరు కాదో సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతం అవుతున్నారట. ప్రస్తుతం మంత్రివర్గంలో అత్యధిక పీఎలు, అత్యధిక చెల్లింపులో మంత్రి దయాకర్‌రావే టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
సొమ్మెలా సమకూరుతుంది…?
ప్రభుత్వం నియమించిన పీఎలు, ఓఎస్డీ, అటెండర్లకు వేతనాలు చెల్లిస్తుంది మరీ. ఎర్రబెల్లి నియమించుకున్న ఇంతమంది పీఎలకు జీతాలు ఎలా సమకూరుతున్నాయో అర్థంకాని విషయం. లక్షల్లో సొమ్మును సమకూర్చడానికి మంత్రి ఏ మార్గాన్ని అనుసరిస్తున్నారో తెలియడం లేదు. పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి కాంట్రాక్టర్లు, ఇతరులకు ప్రైవేట్ సిబ్బంది వేతనాల బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎర్రబెల్లికి ఇంతగా ప్రైవేట్ సిబ్బంది ఎందుకని ప్రశ్న తలెత్తుతుంది. ఆంగ్ల భాషలో అంతగా పరిజ్ఞానం లేని మంత్రి శాఖపరమైన జిఓలను ఆంగ్లం నుంచి తెలుగులోకి తర్జుమా చేసేందుకు సైతం భారీ మొత్తంలో వేతనాలు అందిస్తూ ట్రాన్స్‌లెటర్లను పీఎలుగా నియమించుకున్నారట. వీరి వేతనాలు కూడా తడిసి మోపడవుతున్న మంత్రి కదా సొమ్ము సులభంగానే చక్కబెట్టుకుంటున్నట్లు తెలిసింది. ఇంత విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న మంత్రికి శాఖాపరంగా సైతం బాగానే గిట్టుబాటు అవుతుందని ఈ విషయంలో అందరి మంత్రులంటే ఎర్రబెల్లి ముందువరుసలో ఉన్నట్లు సమాచారం.
మీడియా మేనేజ్‌మెంట్‌లోనూ…
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియా మేనేజ్‌మెంట్‌లోనూ దూసుకువెళుతున్నారట. మేనేజ్‌మెంట్ అంటే ఇంటర్వ్యూలు ఇవ్వడం, ప్రతిపక్షం సమాధానం చెప్పకుండా ఉండే కౌంటర్లు ఇవ్వడం అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. తాను ఏం చేసిన పాజిటివ్‌గా ప్రచారం చేసేలా, నెగిటివ్ ఉన్నా చూసిచూడనట్లు ఉండేట్లు మీడియాను మేనేజ్ చేస్తున్నాడట. మొత్తానికి పని తక్కువ…ప్రచారం ఎక్కువ అన్నట్లు. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లాలోనైతే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన ఇద్దరు మీడియా ప్రతినిధులకు నెలవారి అవసరాలు తీర్చేందుకు లక్షల్లో ముట్టజెప్పుతూ మీడియా అంతటిని మేనేజ్ చేసినట్లు ఎర్రబెల్లి సంతృప్తి చెందుతున్నడట. తనపై ఏ వ్యతిరేక వార్తలు వచ్చిన ఈ ఇద్దరు చక్కదిద్దేలా బాద్యతలు అప్పగించాడట.
ప్రభుత్వం ఇచ్చేది లక్షల్లో…ఖర్చుపెట్టేది కోట్లల్లో…
రాష్ట్రప్రభుత్వం మంత్రుల క్వార్టర్స్ మరమ్మత్తుల కోసం లక్షల రూపాయల్లో బడ్జెట్ కేటాయించింది. ఈ మరమ్మత్తులు ఈ బడ్జెట్‌లోనే ముగిసిపోవాలి కానీ మంత్రి మాత్రం తన క్వార్టర్ రిపేరు కోసం కోట్లల్లో ఖర్చు చేస్తున్నాడట. ఇంటీరియల్, ప్లోరింగ్ ఇతర ఆధునిక సదుపాయాలను ఈ ఇంటిలో ఏర్పాటు చేస్తున్నారట. అయితే ఈ ఖర్చు అంతా పైల్‌పై సంతకం పెడితే చాలు ఈజిగా సమకూరుతుందని ఈ మరమ్మత్తు బాధ్యతను ఎంత ఖర్చు అయిన ఓ కాంట్రాక్టర్ భరిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం.
ఎర్రబెల్లి ట్రస్ట్ పేరుతో ఆదాయం…?
మంత్రి ఎర్రబెల్లి తన ప్రైవేట్ సిబ్బంది, ఇతర కార్యక్రమాలకు భారీగా ఖర్చుపెట్టడానికి ఎర్రబెల్లి దయాకర్‌రావు చారిటబుల్ ట్రస్ట్ మంచి ఆదాయవనరుగా ఉపయోగపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి తన పరపతితో ట్రస్ట్‌కు ఆదాయాన్ని భారీగానే తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీని మూలంగానే మంత్రి ఎంత ఖర్చయిన చేయగలుగుతున్నారనే ప్రచారం ఉంది. మొత్తానికి మంత్రి పదవి లభించిన దగ్గర నుంచి ఖర్చు లెక్క చేయకుండా భారీగా వెచ్చిస్తున్న ఎర్రబెల్లికి సొమ్ము ఎలా సమకూరుతుందనే సందేహాలు పార్టీ వర్గాలతోపాటు అందరిలో కలుగుతున్నాయి. ప్రైవేట్ పీఎలు, పీఆర్వోలతో ఎర్రబెల్లి తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే పార్టీకి తలవంపులు వచ్చేలా ఉన్నాయని కొందరు సీనియర్లు అంటున్నారు. ఎర్రబెల్లిని కంట్రోల్‌లో పెడితే మంచిదని భావిస్తున్నారు.