చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలంలోని దేవుని తండాలో సరైన ధ్రువపత్రాలు లేని 31 వాహనాలు, గుడుంబా తయారీకి వాడే సరుకు, అక్రమ టేకు కలప స్వాధీనం..
శాంతిభద్రతల పరిరక్షణ కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో చందుర్తి మండలం లోని దేవుని తండాలో బుధవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ ద్వారా ప్రతి ఇంటినీ పోలీసులు తనిఖీలు నిర్వహించి.. శాంతిభద్రత పరిరక్షణకు పలు సూచనలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. గుడుంబా తయారీకి వాడే సరుకును, అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను పట్టుకున్నారు.ఈ సందర్భంగా ఏఎస్పి శేషాద్రిని రెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో శాంతి భద్రతల కోసం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు సిహెచ్ శ్రీకాంత్, సిరిసిల్ల అశోక్, శేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.