కాలేశ్వరంపై ‘‘కుట్రల కోణం’’ ఎపిసోడ్‌ 1

https://epaper.netidhatri.com/

`కాళేశ్వరం ముసుగులో తెలంగాణపై కుట్రలు?

`తెలంగాణను మళ్ళీ ఎండబెట్టే కుయుక్తులు.

 

`తెలంగాణ రాజకీయాలలో పెత్తనానికి దారులు.

`కోనసీమను మించిన తెలంగాణపై చిమ్ముతున్న విషాలు.

`ఎండిన కోనసీమకు నీళ్ల తరలింపు మార్గాలు.

`ఆంధ్రా రాజకీయ సలహాదారుల వలలు.

 

`కాళేశ్వరాన్ని ముంచే పనిలో ఎత్తుగడలు.

`బతికిన తెలంగాణ రైతును చెడగొట్టే దుష్ట పన్నాగాలు

`తెలంగాణ బాగుపడితే చూడలేని కుట్రదారులు.

`కళ్లలో నిప్పులు పోసుకున్న తెలంగాణ వ్యతిరేకులు.

`ఎప్పుడు తెలంగాణ ఎండుతుందా? అని ఎదురుచూపులు.

`తెలంగాణ వ్యతిరేక శక్తుల మాయలో నాయకులు.

`పదేళ్ళ అన్నపూర్ణ ఎడారిని చేయాలని చూస్తున్నారు.

`తెలంగాణ శ్మశానం కావాలని కోరుకుంటున్నారు.

`తొండలు గుడ్లు పెట్టని చోట పుట్లు పండడం చూడలేకపోతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఒకప్పుడు తెలంగాణలో పది ఎకరాల భూమి అమ్మినా కోస్తాంద్రలో ఒక ఎకరం వచ్చేది కాదు. కాని నేడు కోనసీమలో వంద ఎకరాలు అమ్మినా తెలంగాణలో ఒక్క ఎకరం కొనలేరు. సరిగ్గా ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు నోటి నుంచి జాలు వారిన ఆణిముత్యాలు. ఆనాడే బిఆర్‌ఎస్‌ నాయకులు గమనించాల్సింది. కాని చంద్రబాబు కూడా తెలంగాణను కీర్తిస్తున్నాడు అనుకున్నారు. కాని ఆ కీర్తి వెనక ఏద కుట్ర పన్నే పనిలో వున్నాడని ఎవరూ ఊహించేలేదు. ఇప్పుడిప్పుడే తేట తెల్లమౌతోంది. చంద్రబాబుకు ఆది నుంచి తెలంగాణ మీద అక్కసే..తెలంగాణ పచ్చబడితే చూడలేడంతే..పాలకుడుగా వున్న కాలంలో కూడా తెలంగాణ గురించి పట్టించుకోలేదు. తెలంగాణకు ఒక రోడ్డు వేయలేదు. తెలంగాణకు ఒక్క చుక్క మంచినీరు అందించే ఏర్పాటు చేయలేదు. పైగా అప్పటి వరకు వున్న చిన్న నీటి పారుదల వ్యవస్ధను మొత్తం చిన్నా భిన్నం చేసిన వ్యక్తే చంద్రబాబు. గొలుసుకట్టు చెరువులను నిర్వీర్యం చేసి, తెలంగాణలో వ్యవసాయం సర్వనాశనం చేశాడు. కనీసం చెరువుల్లో తట్టెడు మట్టితీయాలన్న ఆలోచన కూడా చేయలేదు. దాంతో చెరువులన్నీ ఒట్టిపోయాయి. కొన్ని ఆనవాలు లేకుండాపోయాయి. చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని చెరువులు మాయమయ్యాయి. అలా తెలంగాణ సాగును సాగకుండా చేసి, తెలంగాణ పల్లెలు గూడు చెదిరిపోయేలా చేసిన దుర్మార్గ పాలన చంద్రబాబుది. వలసలతో తెలంగాణ ఆగమౌంది.
తెలంగాణ గుండె చెదిరిపోయింది.
పాడిపంట లేకుండాపోయింది. అలా తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమను చూపిన చంద్రబాబుకు తెలంగాణ రావడమే ఇష్టం లేదు. ఎప్పటికైనా తెలంగాణ విఫల రాష్ట్రం అని ప్రపంచానికి చాటాలని చూస్తున్న చంద్రబాబు కళ్లముందే తెలంగాణ సిరుల మాగాణ అవుతుంటే కళ్లు కుళ్లుకోకుండా వుంటాయా? మనసు మండిపోకుండా వుండదా? చంద్రబాబు వేసిన ఎలాంటి రాజకీయ ఎత్తుగడలనైనా చిత్తు చేస్తున్న కేసిఆర్‌ను ఎదుర్కొలేని వాళ్లు తెలంగాణ మళ్లీ గూడి చెదిరిపోతేగాని కేసిఆర్‌కు రాజకీయం కనుమరుగు కాదు? తెలంగాణ ఎండిపోతే గాని కేసిఆర్‌ ప్రభ మసకబారదు? అని ఆలోచించిన తెలంగాణ వ్యతిరేక శక్తులు కాళేశ్వరాన్ని నిండే ముంచే ఎత్తుగడ వేశాయి. సాంకేతిక సమస్యను భూతద్దంలో పెట్టి చూపించి, అబద్దాలను పదే పదే ప్రచారం చేసి బిఆర్‌ఎస్‌ను ఓడిరచాయి. కాళేశ్వరం చరిత్రను కాల గర్భంలో కలిపే కుట్రలకు తెరలేపుతున్నాయి. విజ్ఞులైన తెలంగాణ ప్రజలు కొన్ని రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించాలి. మొన్నటిదాక తెలంగాణలో రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిన వ్యక్తి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు స్కెచ్‌లు వేస్తున్నాడు. తెలంగాణకు ముందు కర్నాకటలో కాంగ్రెస్‌ గెలుపుకోసం కృషి చేశాడు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు పనిచేసిన వ్యూహకర్త,
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహ రచన సాగించాలి. అంతే కాని తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాడు. అంతే కాకుండా మొన్నటిదాకా తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో ఓటు హక్కు కూడా లేని షర్మిల, నేనే ముఖ్యమంత్రిని అని ప్రకటించేవారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో పిపిసి. అధ్యక్షురాలైన షర్మిల గెలిచేది మేమే.. అధికారంలోకి వచ్చేది మేమే..కాంగ్రెస్‌ గెలుస్తుందని గాని, క్రియాశీలక పాత్ర పోషిస్తుందని గాని చెప్పడం లేదు. చంద్రబాబును షర్మిల పల్లెత్తు మాట అనడం లేదు. ఒకనాడు కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీయే తెలుగుదేశం. ఒక దశలో కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కెస్తానని శపధం చేసిందే చంద్రబాబు. దేశంలో కాంగ్రెస్‌ పతనమ్యే రోజులు దగ్గరపడ్డాయని పదే పదే అన్న నాయకుడే చంద్రబాబు. అలాంటి చంద్రబాబును షర్మిల పల్లెత్తు మాట కూడా అనడంలేదు. కాని జగన్‌ను మాత్రమే తూర్పాపడుతోంది. అంటే ఇందులో వున్న రాజకీయ రహస్యంపై పెద్దగా బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఇవన్నీ ఒకసారి కలగలపి చూస్తే తెలంగాణ బాగు పడడాన్ని చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాడన్నది స్పష్టమౌతోంది.
తాజాగా చంద్రబాబు తెలంగాణలో వున్నది మన ప్రభుత్వమే అన్నంతగా మాట్లాడడం జరిగింది. అంటే తెలంగాణ విషయం వచ్చేసరికి తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమౌతున్నాయి. పొరపాటును ఆంద్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట చంద్రబాబు చెప్పేది ఒకే ఒక మాట. మరో పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా తీర్మాణం చేయలని కోరుతారు. డిల్లీ పెద్దలతో లాబియింగ్‌ చేయిస్తాడు. ప్రభుత్వం మారిన మూడు నెలల్లోనే తెలంగాణ చరిత్రపై దాడి మొదలైంది. కేసిఆర్‌ కీర్తని కనుమరుగు చేసే కుట్ర మొదలైంది. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు పతనం చేసేస్తే కేసిఆర్‌ ఆనవాళ్లు తుడిచిపెట్టుకుపోతాయి. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలకు ఎన్నికలకు ముందే బీజం పడిరది. హైదరాబాద్‌లో ఇటీవల స్ధిరపడిన, గతంలో ఎప్పుడు వచ్చి స్ధిరపడిన వారిని ఏకం చేసి, ఓ కులం పేరును అడ్డంపెట్టుకొని రాజకీయం చేయాలని చూశారు. అందులో భాగంగా ఓ కులమంతా ఏక గ్రీవ తీర్మాణం కూడా చేసింది. తెలంగాణలో కమ్మలంతా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. కాకపోతే అదే కులానికి చెందిన ప్రజలు మాత్రం బిఆర్‌ఎస్‌ను గెలిపించాయి. దాంతో కులాన్ని నమ్ముకోవడం కన్నా, రాజకీయం నమ్ముకొని తెలంగాణను దెబ్బకొట్టాలని చూశారు. కాళేశ్వరంపై విషం చిమ్మడం మొదలుపెట్టారు. అందులో భాగంగా తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ పార్లమెంటు ఎన్నికల వేళ ఏకమౌతున్నాయి. తెలంగాణలో మళ్లీ ఆకలి కేకలు వినపడాలని తాపత్రయపడుతున్నాయి. ఆనాడు చంద్రబాబు చెప్పినవి నిజాలు చేయాలని చూస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే బాగుంటుందని సినీ నటుడు మురళీమోహన్‌ సూచన చేస్తే కుదిరేపని కాదన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు వృదా? అన్నారు. ఎత్తిపోతల పధకాల నిర్మాణం చేస్తే విద్యుత్‌ వినియోగం పెరుగుతుంది. రాష్ట్రానికి నష్టమొస్తుందన్నాడు. కాని రైతులు బాగుపడతారు. తెలంగాణ రైతులకు మేలు జరుగుతుందని చంద్రబాబు ఆలోచించలేదు. తెలంగాణలో ఎత్తిపోతల పధకాలు కూడా వృదా అని మరోసారి నిరూపించి, తెలంగాణ ప్రగతిని కనుమరుగు చేయాలని కుట్రలు పన్నుతున్నారు. తెలంగాణను ఎత్తిపోతల పధకాలు కూడా బాగు చేయలేవని నిరూపించాలని చూస్తున్నారు. మళ్లీ ఆహారం కోసం ఆంద్రామీద ఆదారపడేలా చేయాలని చూస్తున్నారు. కాళేశ్వరం ద్వారా కట్టడి చేస్తున్న నీటిని మళ్లీ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆంద్రకు చేరితే మళ్లీ అక్కడ సాగు చిగురిస్తుందని తెలంగాణ వ్యతిరేకుల పన్నాగం. ఇలా మళ్లీ తెలంగాణను తమ గుప్పిట్లోకి తీసుకోవాలన్న కుయుక్తులు పన్నుతున్నారు.
ఒకప్పుడు ఎడారిలాంటి తెలంగాణను సంపన్నం చేసిందే కేసిఆర్‌.
సుసంపన్నం చేసిందే నీళ్లు. ఆ నీళ్లే లేకపోతే తెలంగాణకు మళ్లీ మిగిలేది కన్నీళ్లు. ఇదే తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆశలు. తెలంగాణ ప్రజలు సంతోషంగా వుంటే చూడలేరు. తెలంగాణ ప్రజలు సమస్యలు లేకుండా వుంటే తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణ రైతు రాజుగా మారితే కుళ్లుకుంటున్నారు. రైతంటే కోనసీమ రైతు అని గొప్పలు చెప్పుకున్న చోట, బీడుల్లో బంగారం పండుతూ, తెలంగాణ పచ్చని పైటను పర్చుకుంటే చూసి కళ్లలో నిప్పులు పోసుకున్నారు. నరదిష్టికి నల్లరాళ్లుకూడా పగిలిపోతాయన్నట్లుగా కాళేశ్వరం కుంగిపోయిందంటే ఎంతటి దిష్టితనం నిండిన వాళ్లున్నారో అర్ధం చేసుకోవచ్చు. పదేళ్లుగా పచ్చగా వున్న తెలంగాణ ఒక్కసారిగా తెలంగాణ పల్లెలు రూపు మారిపోయేలా, సాగు చిద్రమయ్యేలా వుందన్న భాద తెలంగాణ పాలకులకు లేకపోవడం విచారకరం. తెలంగాణకు కష్టం ఎదురుకాబోతోందా? అన్న ఆందోళన ఏ ఒక్క పాలకపక్షం నాయకుడిలో కనిపించడం లేదు. తెలంగాణ నీళ్లన్నీ ఆంధ్రాకు వెళ్లిపోతున్నాయన్న ఆందోళన ఒక్కరిలోనూ కనిపించడం లేదు. మన రైతు ఆగమౌతాడన్న ఆలోచన ఏ ఒక్కరు చేయడం లేదు. కాళేశ్వరం మంచిదా? చెడ్డదా? అందులో అవినీతి జరిగిందా? లేదా? అన్నది తర్వాత తేల్చొచ్చు. కాని ఇప్పుడు ఇంత కాలం ఒడిసిపట్టి, తెలంగాణకు చుక్క చుక్క అందించారు. ఇప్పుడు అదే నీటి చుక్క జాడ లేకుండాపోయే ప్రమాదం కనిపిస్తోంది. వెంటనే మరమ్మత్తులు చేయాల్సిన అవసరం వుంది. అది విస్మరించి రాజకీయం చేయడం తగదు. కేసిఆర్‌ మీద, ఆయన కుటుంబం మీద రాజకీయంగా శత్రుత్వం వుంటే రాజకీయంగా ఎదుర్కొవాలి. అయినా ప్రజలు బిఆర్‌ఎస్‌ను కాదని కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. దాన్ని నిలుపుకోవాలన్నా, భవిష్యత్తులో కాంగ్రెస్‌ తిరుగులేని శక్తిగా మారాలన్నా కాళేశ్వరం మరమ్మత్తులు చేయాల్సిన అవసరం వుంది.
కాళేశ్వరం మరమ్మత్తులు చేయాల్సిన పని వదిలేసి, పనులు వృధా ప్రయాస అని పాలకులు తేల్చేయాలనుకుంటున్నారా?
అది ఒక రకంగా తప్పుడు నిర్ణయం అవుతుంది. ముందు తెలంగాణ చెరువులు ఎండిపోకుండా చూడండి. వెంటనే నింపడం మొదలుపెట్టండి. చెరువు ఒక్కసారి నింపితే సరిపోతు. నిరంతరం నింపుతూనే వుండాలి. ఒక్కసారి చెరువు నింపడం ఆగిందంటే తెలంగాణ ఎడారే. తెలంగాణ అన్నపూర్ణగా మారాలంటే తెలంగాణ చెరువులకు కాళేశ్వరం తోడు కావాలి. చెరువులు నిరంతరం నింపడం వల్లనే భూగర్భ జలాలు పెరుగుతాయి. బోర్లు ఎండిపోకుండా వుంటాయి. తెలంగాణలో ఇప్పుడు 29లక్షల పంపుసెట్లు వున్నాయి. వాటికి నీరందించేది చెరువులే. అందుకు కాళేశ్వరం ఎత్తిపోతల పధకమే దిక్కు. మరి మర్చిపోయి రాజకీయం చేయకండి. కాళేశ్వరం నీళ్లు నింపితే కూలిపోతుందని ఇప్పుడే అంచనాకు రాకండి. రైతుల ప్రయోజనాల కన్నా, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమనుకోకండి. రైతులను రాజకీయ క్రీనీడలో నట్టెట ముంచకండి. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఒక్క విషయాన్ని గమనించాల్సిన అవసరం వుంది. కేసిఆర్‌ కాళేశ్వరం నిర్మాణం ఓవైపు చేపడుతూనే, మరో వైపు చెరువుల మరమ్మత్తులు చేపట్టారు. తెలంగాణలోని 46వేల చెరువులు మరమ్మత్తులు చేసి, మళ్లీ వాటిని నీటి గంళాలం చేశారు. తొలుత చెరువులు నింపిన నాడు కాళేశ్వరం నిర్మాణం లేదు. కాని చుక్క నీరు కూడా కిందికి వెళ్లకుండా గోదారి నీళ్లన్ని తెలంగాణ చెరువులకు మళ్లించాడు. మండు వేసవిలో తొలిసారి తెలంగాణ చెరువులు నింపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు చెరవు ఎండిపోయింది లేదు. చుక్క తగ్గింది లేదు. నిరంతరం చెరువుల్లో నీళ్లు నింపారు. దానికి తోడు కాళేశ్వరంలో భాగంగా నిర్మాణాలు జరిగిన 20 రిజర్వాయర్లు నింపుతూ వచ్చారు. దాంతో తెలంగాణ వ్యాప్తంగా విపరీతంగా భూగర్భ జలాలు పెరుగుతూ వచ్చాయి. ఒకప్పుడు అట్టడుగున వున్న భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలో కనీసం వెయ్యి ఫీట్లు బోర్‌ వస్తే గాని నీటి చుక్క జాడ వుండేది కాదు. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో ఇంకుడు గుంతలు పెట్టించారు. కాని తెలంగాణ భూగర్భ జలాలు పెంచే ప్రయత్నం ఆనాడు చేయలేదు. కాని తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ హైదరాబాద్‌ పరిసర చెరువులు కూడా నిండు కుండల్లా మార్చడంతో హైదరాబాద్‌లో వంద ఫీట్లకే నీళ్లు పడే అవకాశం ఏర్పడిరది. తెలంగాణ రాకముందు హైదరాబాద్‌లో వారానికి ఒకసారి మంచినీళ్లు వచ్చేవి. వానాకాలంలో వారానికి మూడు రోజులకు ఒకసారి వచ్చేవి. కాని తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో నిత్యం నీరు వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మిషన్‌ భగీరధతో ఇంటింటికి మంచినీళ్లు అందుతున్నాయి. వాటన్నీంటికీ కాళేశ్వరం నుంచే నీటి సరఫరా అవుతోంది. అలాంటి కాళేశ్వరంలో చిన్న సాంకేతిక సమస్య ఎదురైతే దానిని బాగు చేయాల్సింది వదిలేసి, కేసిఆర్‌ను దోషిగా చిత్రీకరించే దశలో, దానిని నిరుపయోగం చేస్తే ఎండిపోయేది తెలంగాణే. చెడపోయేది తెలంగాణ సాగే. నష్టపోయేది తెలంగాణ రైతే. చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతే రైతు ఆగ్రహం ఎలా వుంటుందో అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే చూసే ప్రమాదం ముంచుకొస్తుంది చూడండి. రైతులతో శభాష్‌ అనిపించుకునే పని చేయాలనే గాని, రైతులతో శాపనార్ధలు పెట్టించుకునే స్ధితి తెచ్చుకోవద్దు. అంతే కాదు తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే నిరంతర కరంటు ఇచ్చారు. అప్పుడు కోతలు లేకుండా జనం కరంటు చూశారు. ఇప్పుడు కోతలు చూపిస్తే, వ్యతిరేకత మూటగట్టుకున్నట్లే. ఎందకంటే విడాకులు తీసుకున్న తర్వాత మొదటి మొగుడే మంచోడన్న ఆలోచన వస్తే, ఏమౌతుందో అర్దం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *