నీటిలో నిప్పు రవ్వలు!

https://epaper.netidhatri.com/

`ఎన్నికల ముందు రాజకీయ సెగలు.

`ప్రచార వేడి రాజేస్తున్న మాటలు.

`ఎన్నికలలో నీళ్లు, ప్రాజెక్టులే ప్రధాన అంశాలు.

`హామీల అమలు నుంచి బీఆర్‌ఎస్‌ను పక్కదారి పట్టించే ఎత్తులు.

`బీఆర్‌ఎస్‌పై అవినీతి మరకలంటించే ప్రయత్నాలు.

`మెజారిటీ స్థానాలు గెలుచుకునేందుకు కాంగ్రెస్‌ కుయుక్తులు.

`ప్రాజెక్ట్‌ల మీదనే కయ్యాలు.

`బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య జగడాలు.

`కేసీఆర్‌ను రెచ్చగొట్టి రేవంత్‌ సాధించేదేముంది?

`అనరాని మాటలని చూపించే ఆధిపత్యమేమిటి?

`రేవంత్‌ రెడ్డి మరీ తొందర పడుతున్నాడా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నీటిలో నిప్పు రవ్వలు ఎగసిపడుతున్నాయి. ఎన్నికల రాజకీయాల ముందు సెగలు గక్కుతున్నాయి. అప్పుడే ప్రచార వేడిని రాజేస్తున్నాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నీళ్లే ప్రధానాంశాలు కానున్నాయి. అయితే రాజకీయాలన్న తర్వాత ఎత్తులు,పైఎత్తులు, జిత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు సహజం. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పార్టీ వాటి అమలు విషయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు నీళ్ల సమస్యను ఎంచుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టును ముందేసుకున్నది. అయితే ఇంత వరకు బాగానే వుంది. కాని కృష్ణా నది విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పప్పులో కాలేసింది. ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ వ్యూహంలో చిక్కిపోయింది. దాన్ని నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్‌ పడరాని పాట్లు పడుతోంది. ప్రతిపక్షాన్ని విమర్శిస్తోంది. తప్పంతా బిఆర్‌ఎస్‌దే అని ఎగదోసే ప్రయత్నం చేస్తోంది. ఎలాగైనా పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలు పొందాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ వేస్తున్న ఎత్తులు ఎవరికి మేలు చేకూర్చిపెడతాయన్నది ఆసక్తిగా మారింది. ప్రజలు కాంగ్రెస్‌ చెప్పింది వింటారా? లేక ప్రతిపక్షం బిఆర్‌ఎస్‌ మాటలు వింటారా? అన్నది కూడా తేలే సమయం. కేసిర్‌ను రెచ్చగొట్టి నీటి రాజకయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చూస్తున్నారు. అందులో భాగంగా కేసిఆర్‌ను అనరాని మాటలు కూడా అన్నారు. నీటి విషయంలో రేవంత్‌రెడ్డి మరీ తొందర పడుతున్నాడా? అన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమౌతున్నాయి.
నీళ్లే తెలంగాణ ఉద్యమంలో రగిలిన నిప్పు కణికలు. ఎగిసిపడిన నిప్పు రవ్వలు.
నీళ్లు, నిధులు, నియామాకాలే తెలంగాణ ఉద్యమానికి ఆయువులు. అలాంటి నీళ్లే మళ్లీ పదేళ్ల తర్వాత ప్రస్తావనకు వస్తున్నాయి. ఏ నీళ్లుతో బిఆర్‌ఎస్‌ ఎదిగిందో, అదే నీళ్లలో ఆ పార్టీని సమాధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చూస్తున్నారు. ఇంత కాలం బిఆర్‌ఎస్‌ చేసిన నీళ్ల రాజకీయం అంతా డొల్ల అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అదికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం నీళ్లలో ఇప్పటికే పీకల్లోతు మునిగిపోయిన బిఆర్‌ఎస్‌ తీసుకొచ్చిన మళ్లీ కృష్ణా నది నీళ్లలో నిమజ్జనం చేయాలని రేవంత్‌రెడ్డి చూస్తున్నారు. దాంతో రాష్ట్రంలో నీళ్ల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కాంగ్రెస్‌ సంధిస్తున్న నీళ్ల రాజకీయంలో పడి బిఆర్‌ఎస్‌ విలవిలలాడిపోతోంది. తేరుకునేందకు కూడా వీలులేకుండాపోతోంది. బిఆర్‌ఎస్‌ నుంచి ఒక్కరు మాట్లాడితే కాంగ్రెస్‌ నుంచి పది మంది గయ్యిమంటున్నారు. బిఆర్‌ఎస్‌కు మాటలు లేకుండా చేస్తున్నారు. చెప్పుకునేందుకు కూడా వీలు లేనంతగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాటల దాడి చేస్తున్నారు. దాంతో బిఆర్‌ఎస్‌ నాయకులు కాలం గొప్పది. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది. అంటూ వేదాంతాలు వల్లిస్తున్నారు. గతంలో చెప్పినంతగా నీళ్ల విషయంలో వివరంగా సంగతులేమీ చెప్పలేకపోతున్నారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌కు దూకుడును పెంచుతున్నాయి. బిఆర్‌ఎస్‌ను వెనకబడేలా చేస్తున్నాయి.
నీళ్లే నిప్పులై పార్లమెంటు ఎన్నికలకు ప్రధాన అస్త్రాలౌతున్నాయి.
శాసన సభ ఎన్నికలు కాళేశ్వరం చుట్టూ తిరిగాయి. కాళేశ్వరంలో రాజకీయ సుడిగుండాలు ఏర్పడ్డాయి. బిఆర్‌ఎస్‌ ఓటమికి కారణమయ్యాయి. గెలిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ బృందాల పరిశీలనలు జరుగుతున్నాయి. ప్రజాధనం బిఆర్‌ఎస్‌ నీళ్లులో పారబోసిందని కాంగ్రెస్‌ వాదన. అంచనాలు విపరీతంగా పెంచి, ఎప్పటికప్పుడు ఇష్టాను రీతిన నిధులు పెంచుతూ పోయారు. నిర్మాణంలో నాణ్యతను గాలికి వదిలేశారు. హడావుడిగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి 2018లో బిఆర్‌ఎస్‌ గట్టెక్కింది. రెండోసారి బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. కాని 2023 నాటికి బిఆర్‌ఎస్‌ అవినీతి పుట్ట పగిలింది అని మరోసారి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో చెప్పాలని కాంగ్రెస్‌ చూస్తోంది. అయితే కాంగ్రెస్‌ మాటలు ఈసారి ప్రజలు వినే పరిస్దితి కనిపించడం లేదు. ఇంత కాలం వచ్చినవి కాళేశ్వరం నీళ్లు కాదంటూ కాంగ్రెస్‌ చేసే ప్రచారాన్ని ప్రజలు విశ్వసించేలా లేరు. ఈ మధ్య మంత్రి కొండా సురేఖ రంగనాయక సాగర్‌ నుంచి విడుదల చేసిన నీళ్లు కాళేశ్వరం నీళ్లే అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని బిఆర్‌ఎస్‌ బలంగానే ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాకపోతే కాళేశ్వరానికి పగుళ్లు వచ్చి ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్ధకమైందనేదానిని మాత్రం కాంగ్రెస్‌ వదలకుండా ప్రచారం చేస్తోంది. తెలంగాణ ప్రజలను బిఆర్‌ఎస్‌ ఆగం చేసిందని ఆరోపణలు సాగిస్తున్నా, ఇంత కాలం నీళ్లు ఇచ్చన పార్టీగా బిఆర్‌ఎస్‌ను రైతులు గుర్తిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. సాగు రంగానికి మళ్లీ గడ్డు కాలం తెచ్చిపెట్టింది. అనేది బిఆర్‌ఎస్‌ ప్రధాన ఎన్నికల ప్రస్తావన కానున్నది. ఎందుకంటే ఎన్నికల ముందు కేసిఆర్‌ పదే పదే ఇదే విషయాన్ని ప్రతీ సభలోనూ ప్రజలకు వివరించారు. ఇప్పుడు అదే నిజమౌతోంది. దాంతో పార్లమెంటు ఎన్నికల్లో కేసిఆర్‌ చెప్పిందే ప్రజలు వినే పరిస్దితి కనిపిస్తోంది. కాకపోతే కాంగ్రెస్‌ వాదనంతా తుమ్మిడి హట్టి దగ్గర కేవలం 35వేల కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేస్తే సరిపోయేదని, కాళేశ్వరం తెలంగాణ పాలిట తెల్ల ఏనుగు అంటోంది. టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గగా మార్చుకొని కాళేశ్వరం లాంటి సాగునీటి ప్రాజెక్టులు దేశం మొత్తం కటిస్తానంటూ గొప్పలు చెప్పుకున్నాడు. కేసిఆర్‌ చేసిన మోసం వల్ల తెలంగాణకు మళ్లీ కష్టం తెచ్చిపెట్టాడు . మళ్లీ పాత రోజులు తెచ్చేలా చేశాడు. ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటూ అప్పుల పాలు చేశాడు. తెలంగాణను దివాళా తీయించారని కాంగ్రెస్‌ వాదిస్తోంది.
ఇక కృష్ణా నది వాటాలపై తాగా కాంగ్రెస్‌ కేంద్రానికి అధికారమిస్తూ నిర్ణయం తీసుకోవడం, కృష్ణా జలాల పంపకాలను మొత్తం కేంద్రానికి అప్పగించి తెలంగాణకు అన్యాయం చేస్తోందని బిఆర్‌ఎస్‌ వాదిస్తోంది.
బిఆర్‌ఎస్‌ చెబుతున్నదానిలో ఎలాంటి వాస్తవం లేదని అంతా గతంలో బిఆర్‌ఎస్‌ చేసిందే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ను కడిగిపారేశారు. లెక్కలతో సహా సచివాయలంలో బిఆర్‌ఎస్‌ భండారం బైట పెట్టాడు. దాంతో అసలు ఏం జరుగుతుందన్నదానిపై ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ..ఎన్నికలకు అస్త్రాలు. గట్టగా మాట్లాడితేనే కాంగ్రెస్‌కు మెజార్టీ స్దానాలు. బిఆర్‌ఎస్‌కు ఇప్పటికే అంటిన అవినీతి మరకలు. వాటిని తుడుచుకునేందుకు బిఆర్‌ఎస్‌ అవస్ధలు. తప్పు చేయలేదని నిరూపించుకునే పనిలో బిఆర్‌ఎస్‌. నిత్యం ఒక బిఆర్‌ఎస్‌ తప్పును తెరమీదకు తెస్తూ, తూర్పాపపడుతున్న కాంగ్రెస్‌. నిత్యం బిఆర్‌ఎస్‌ మీద వస్తున్న పుంకాను పుంకాల వార్తలే ఆ పార్టీకి గుదిబండలు. అదేంటో గాని కృష్ణా నది జలాల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక తిరకాసు వుండనే వుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో కర్నాటకతో కొట్లాట. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాటాల తేడాలు కొలిక్కి రావాలి. నిజానికి అటు గోదావరి, ఇటు కృష్ణా నది బేసిన్‌ ఎక్కువ శాతం తెలంగాణలోనే వుంది. ఎక్కవ పరీవాహక ప్రాంతాలు ఎక్కువ నీరు వాడుకునేందకు అవకాశాలు వుంటాయి. అది సాంకేతికంగా నిజమే కావొచ్చు. కాని గోదావరి, కృష్ణా నదులు, ఆంధ్రప్రదేశ్‌ దాటి వెళ్లిపోయి, మరో రాష్ట్రం గుండా ప్రవహిస్తే అలాంటి లెక్కలు వుంటాయి. కాని రెండు నదులు చివరగా ప్రవహించేది ఆంధ్రప్రదేశ్‌లోనే…అంటే ప్రకృతి విపత్తులు ఎదురయ్యేది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌కే…పైగా నదులకు వచ్చే వరదల వల్ల నస్టపోయేది కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమే..అందువల్ల నీటి కేటాయింపుల్లో కొంత హెచ్చుతుగ్గులుంటాయి. సముద్రంలో కలిసే ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా నది నీరు ఎక్కువగా కేటాయింపులు వుంటాయి. అది నాయకులకు తెలిసీ తెలియక లేనిపోని వివాదాలు రగిలిస్తుంటరు. రాజకీయ వేడిని సృష్టిస్తుంటారు. ఎన్నికల సమయాల్లో మాత్రమే వీటిని తెరమీదకు తెస్తుంటారు. కృష్ణానదిలో తెలంగాణకు న్యాయమైన వాటా 291 టిఎంసిలే వస్తాయి. వాటినే గతంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒప్పుకోవడం అన్నది సాంకేతికంగా సరైందే… మరి అలాంటి అంశాన్ని తిరగదోడిన కాంగ్రెస్‌ వాటిని రుజువు చేయకపోతే మాత్రం రాజకీయంగా హస్తానికి నష్టమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *