వరదల దృష్యా నర్సంపేట డివిజన్ లో కలెక్టర్ పర్యటన.
అధికారులతో కలిసి వాగులు,లో లెవల్ కాజ్ వేలు,వరద ఉధృతిని పరిశీలన
భారీ వర్షాల దృష్ట్యా అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట,నేటిధాత్రి:
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు,వరదల దృష్యా నర్సంపేట డివిజన్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పర్యటించారు.
వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.
శనివారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత శాఖల అధికారులతో కలసి నర్సంపేట డివిజన్లోని ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ పాకాల చెరువు నుండి వచ్చే వరద నీటిలో లెవల్ కాజ్ వే ను,నల్లబెల్లి మండలంలోని లేంకాలపెల్లి నందిగామ గ్రామాల మధ్య కాజ్ వే,నర్సంపేట నుండి చెన్నారావుపేట వెళ్లే రహాదారిలో ముగ్దుంపుర వద్ద, నర్సంపేటలోని మాదన్నపేట వద్ద కాజ్ వేలను పరిశీలించారు. కాజ్ వే ల వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను పరిశీలించి సమర్ధ నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి రెడ్ అలర్ట్ గా మారే సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెరువులలో నీటిమట్టం ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.గ్రామాల్లో భారీ వర్షాలపై టామ్ టామ్ చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులలో,లో లెవెల్ కాజ్ వేలపై వరదనీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు వెళ్లడానికి అనుమతించవద్దని పేర్కొన్నారు. చెరువులలో ప్రజలను చేపలు పట్టే వారిని రైతులను పశు కాపరులను సందర్శకులను అనుమతించవద్దని అన్నారు.ఇప్పటికే అన్ని శాఖల అధికారులు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉన్నారని,విపత్కర పరిస్థితి ఎదురైతే ఎస్డిఆర్ఎఫ్, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు జిల్లాల సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు కాలువల్ని దాటే ప్రయత్నం చేయకుండా ప్రజలకు సూచనలు చేయాలని కలెక్టర్ తెలిపారు.ఈ పర్యటనలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి,ఆర్డిఓ ఉమారాణి డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు , జిల్లా పంచాయతీ అధికారి కల్పన, తాహసిల్దారులు రవిచంద్రారెడ్డి, ఎంపీడీవోలు,పోలీసు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.