పట్టణాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం..
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి..
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ లో జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంపై నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఒకరోజు శిక్షణతో పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మంచిర్యాల డిసిపి భాస్కర్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించామని అన్నారు. కార్యక్రమం జూన్ 12 వరకు కొనసాగుతుందని, ఎమ్మెల్యే, మేయర్, మున్సిపల్ చైర్మెన్ ,సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ స్థానికంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు.

పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మన పనితీరు ఉండాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకుంటూ క్షేత్రస్థాయి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. వేసవి కాలంలో జిల్లాలో తాగు నీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు అవగాహన అందించేందుకు ఏర్పాటుచేసిన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై ప్రజా ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల సర్పంచులు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు మునిసిపాలిటీల చైర్ పర్సన్లు వైస్ చైర్ పర్సన్లు కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
