మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి కార్మికుల ప్రతి సమస్యను యాజమాన్యంతో కొట్లాడి సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని, సింగరేణి కార్మికులు సిఐటియు యూనియన్ ను గెలిపించాలని సిఐటియు డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాల్ కోరారు. మందమర్రి ఏరియా కళ్యాణిఖని 5వ గనిపై వడ్లకొండ శివ అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నట్టే సింగరేణి యూనియన్ ఎన్నికల్లో మార్పు కోసం సిఐటియు యూనియన్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఏరియాలో గెలిచిన టిబిజికేఎస్ యూనియన్, ప్రాతినిధ్య సంఘంగా గెలిచిన ఏఐటియుసి యూనియన్ సంఘాలు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, నిస్వార్ధంగా కార్మికుల క్షేమం కోరుకుంటూ వారి సమస్యల పరిష్కారానికి సిఐటియు పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఏఐటియుసి వల్ల క్వార్టర్స్ లేని కార్మికులకు చెల్లించే ఇంటి కిరాయిని ఆపేసిన విషయాన్ని గ్రహించి వారికి ఇంటి కిరాయి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని, అక్టింగ్ ప్రమోషన్లు, సర్ఫేస్ మజ్దురు, గనులకు వచ్చే రోడ్ల రిపేరు కోసం యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించడంలో విజయవంతమయ్యామని తెలిపారు. క్వార్టర్స్, ప్రమోషన్లు, డిప్యూటేషన్ల పనుల కోసం రెండు యూనియన్లు కార్మికులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఏరియాలో ప్రధాన ప్రతిపక్షంగా పోరాడుతున్న సిఐటియు సూర్యుని గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ సంకే వెంకటేష్, బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ వెంకటస్వామి, అల్లి రాజేందర్, ఉపాధ్యక్షులు వడ్లకొండ ఐలయ్య, అలవాల సంజీవ్, ఆర్గనైజర్ లు దొండ నవీన్, ఆదర్శ్, చైతన్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.