సీఐ ఓవరాక్షన్
వరంగల్ నగరంలో భూకబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తుల పట్ల, భూకబ్జాదారులకు సహకరించిన పోలీసు అధికారుల పట్ల పోలీస్‌శాఖ కఠినంగా వ్యవహారిస్తుందని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ పదేపదే చెబుతున్న పోలీస్ బాస్ మాటలను పెడచెవిన పెడుతూ యథేచ్చగా భూకబ్జాదారులకు పోలీస్ అధికారులు సహకరిస్తున్నారని నగర ప్రజలు విమర్శిస్తున్నారు. వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన మిడిదొడ్డి సంపత్ అనే భూభాదితుడిని కాజీపేట సీఐ అజయ్‌కుమార్ తీవ్ర వేధింపులకు, బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితుడు తన ఆవేదనను ‘నేటిధాత్రి’కి వ్యక్తం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…హన్మకొండ మండలం వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన మిడిదొడ్డి సంపత్ భూబాధితుడికి సర్వే నెంబర్ 641/ఎ/ఇ లో గల స్థలం విషయంలో వివాదం ఉంది. ఈ వివాదానికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తున్న క్రమంలో బాధితుడైన సంపత్‌కు కోర్టు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ కొంతమంది భూకబ్జాదారులు 641/ఎ/ఇ వడ్డేపల్లిలోని ప్రశాంత్‌నగర్ స్థలంలో అక్రమనిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ విషయంలో కాజీపేట సీఐ అజయ్‌కుమార్ తనకు ఫోన్ చేసి ప్రశాంత్‌నగర్ స్థలవివాదంలో పోలీస్‌స్టేషన్‌కు రావాలంటూ మీపై కేసు నమోదైందని వస్తావా…రావా…అంటూ పరుషపదజాలంతో తిడుతూ బెదిరించాడని తెలిపారు. ఆ స్థలం మాదేనని కాజీపేట సీఐ అజయ్‌కుమార్ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా కబ్జాదారులకు వంతపాడుతూ తమను మానసికంగా భయభ్రాంతులకు గురిచేస్తూ వేధిస్తున్నాడని చెప్పాడు. మాకు కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ ఉందని కూడా చెప్పిన వినకుండా పోలీస్‌స్టేషన్‌కు రావాల్సిందే…రాకుంటే బాగుండదని వ్యక్తిగత దూషణ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు రమ్మని ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు…రా…బే…అంటూ అవమానకరంగా మాట్లాడుతూ తనను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించాడు. నాకు జరుగుతున్న అన్యాయంపై ప్రెస్‌మీట్ పెట్టుకుని వాస్తవాలను ప్రజలకు, పోలీసు ఉన్నతాధికారులకు తెలియపరుచుకుంటానని బాధితుడు సీఐకి చెప్పగా ప్రెస్‌మీటే పెట్టుకో…ఇంకేమైనా పెట్టుకో…అంటూ ధ్వంధార్థంతో తిట్టాడని తెలిపాడు. ఇదిలా ఉండగా…భూబాధితుల కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భూబాధితుల ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినా నగరంలో భూబాధితులకు భూకబ్జాదారుల నుంచి, వారికి సహకరిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల నుండి వేధింపులు, బెదిరింపులు తప్పడం లేదని బాధితులు వాపోతున్నారు. పోలీసులు సివిల్ తగదాలలో తలదూర్చవద్దని పోలీసు ఉన్నతశాఖ అధికారులు చెబుతున్న నగరంలో కొంతమంది పెడచెవిన పెడుతూ భూబాధితులను పైవిధంగా బెదిరింపులకు గురిచేయడంతోపాటు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి విషయాల్లో గత కొన్ని రోజుల క్రితం భూకబ్జాదారులకు సహకరిస్తున్నాడని విచారణలో తేలడంతో కాకతీయ యూనివర్సిటీ సీఐ రాఘవేందర్‌రావు, ఎస్సై విఠల్‌లను సస్పెండ్ చేసిన విషయం మరవకముందే కాజీపేట సీఐ అజయ్‌కుమార్ భూకబ్జాదారులకు వంతపాడుతూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ భూబాధితుడిని బెదిరించిన వైనాన్ని చూస్తే పోలీసు అధికారులకు పోలీస్ బాస్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల గౌరవం, భయం ఏ మాత్రం లేనట్లు కనిపిస్తుందని నగర ప్రజలు, భూబాధితులు భావిస్తున్నారు. ‘నేటిధాత్రి’ కాజీపేట సీఐని వివరణ కోరేందుకు ఫోన్ చేయగా సీఐ అందుబాటులో ఉండటం లేదు.